Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!
ABN , First Publish Date - 2023-07-21T19:08:24+05:30 IST
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ఇప్పట్లో బీజేపీ గట్టెక్కేలా కనిపించట్లేదు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడమే పనిగా పెట్టుకున్న ఈటల రాజేందర్ (Etela Rajender).. చేరికల కమిటీ చైర్మన్ కాస్త బుజ్జగింపుల చైర్మన్‌గా మారిపోయారు!. అయినప్పటికీ పార్టీలో మాత్రం పరిస్థితులు చక్కబడట్లేదు. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఇవన్నీ ఉండవనీ అన్నీ సర్దుకుంటాయని కేంద్ర అధినాయకత్వం భావించినప్పటికీ అవి మరింత ఎక్కువయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ లుకలుకలతో బీజేపీ కాస్త.. ‘కల్లోల్ల కమలం’గా మారిపోయింది.!. అవన్నీ అటుంచితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం నాడు కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కారక్రమానికి ఢిల్లీ నుంచి ఒకరిద్దరు పెద్దలు, రాష్ట్ర కమలనాథులు తరలివచ్చారు. పలువురు ముఖ్యులు డుమ్మా కొట్టారు. ఇంకొందరైతే కార్యక్రమానికి వచ్చామా..? వెళ్లామా..? అన్నట్లు ఉంటే.. మరికొందరు ఎప్పుడొచ్చారో.. ఎప్పుడు బయటికెళ్లారో కూడా తెలియని పరిస్థితి. ఇక కార్యక్రమంలో ప్రసంగించిన వారైతే ఎవరేం మాట్లాడారో.. అసలు ఏం మాట్లాడాలని అనుకున్నారో కూడా అర్థం కాక కార్యక్రమం అంతా గందరగోళంగానే సాగింది.
ఉలిక్కిపాటు..!
బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, మురళీధర్ రావు, ప్రకాశ్ జావడేకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తరుణ్ చుగ్‌తో పాటు పలువురు నేతలు ప్రసంగించారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా.. సంబంధం లేని మాటలు మాట్లాడటం, ఇందులో ఒకరిద్దరు భావోద్వేగానికి లోనవ్వడం, కొందరు కేసీఆర్ సర్కార్‌పై కన్నెర్రజేసి మాట్లాడితే.. ఇంకొందరు కంటతడి పెట్టేశారు. మొత్తమ్మీద కార్యక్రమం మొత్తం చిత్రవిచిత్రాలుగానే జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే కార్యక్రమానికి రాని ఒకరిద్దరు విజయశాంతి లాంటి వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేపే కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ పరిణామాలతో ఏమిటీ గందరగోళం..? ఎందుకీ గ్రూపులు..? నేతలు ఎందుకిలా మాట్లాడుతున్నారు..? పార్టీలో అసలేం జరుగుతోంది..? ఏమిటీ ముఖ్యమంత్రి జపం..? అని రాష్ట్ర, కేంద్ర అధినాయకత్వం ఉలిక్కిపడిందట.
ఎవరేం మాట్లాడారో..?
బండి సంజయ్ : నా మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలి. కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇక్నైనా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలి. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి నాకుంది. పత్రికల్లో ఉండే వాళ్ళు ప్రజల్లో ఉండలేరు. సోషల్ మీడియా (Social Media), వార్తా పత్రికల్లో ఉండటం కాదు.. ప్రజల్లో ఉండాలి. మునుగోడులో (Munugodu) కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Komati Reddy Rajagopal Reddy) పైసలు పంచలేదు.. ఆయన దగ్గర డబ్బుల్లేవు. కొందరు నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు.
సోయం బాపురావు : కిషన్ రెడ్డిని సీఎం చేయాలి. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు.. ఇదే మాట ఆదిలాబాద్‌లో చెబుతాను.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా చెబుతున్నాను. అధ్యక్షుడి అరెస్ట్‌కు బదులు తీర్చుకోవాలి. నా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలిపిస్తాను. ఢిల్లీ నాయకుల నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి. బీఆర్ఎస్‌ను ఓడించి పగ తీర్చుకోవాలి.
కిషన్ రెడ్డి : రానున్న 100 రోజులు బీజేపీకి కీలకం. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం ధర్నాలు చేస్తాం. 25న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కూడా మహాధర్నా చేపడుతాం. కొత్త పెన్షన్ దారులు, కొత్త రేషన్ కార్డుల కోసం కూడా బీజేపీ నిత్యం పోరాటం చేస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన రేషన్ కార్డులే.. ప్రస్తుతం ఉన్నాయి. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. నన్ను పోలీసులు అరెస్ట్ చేసినా అలసిపోలేదు. నేను గతంలో పార్టీ ఆఫీసులోనే ఉంటూ కాలేజీకి వెళ్తూ కష్టపడి పైకి వచ్చాను. ఒక సాధారణ కార్యకర్త అయిన నేను జాతీయ పార్టీకి రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. కష్టపడి పని చేసేవారికి తప్పనిసరిగా పదవులు వస్తాయి. మోదీ నాయకత్వంలో దేశంలో నీతివంతమైన పాలన కొనసాగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ : బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో ఆయన్ను చూసి కన్నీళ్లు వచ్చాయి. బాత్రూంకి వెళ్లి ఏడ్చాను. బండి సంబయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. బండి వల్లే తెలంగాణలో బీజేపీ బలపడింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు సంజయ్ నాయకత్వంలోనే జరిగాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరాను. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తాను. ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ (CM KCR) ఈడీని (ED) మేనేజ్ చేశారు. కేసీఆర్‌కు ఈడీ అమ్ముడుపోయింది.
ప్రకాశ్ జావడేకర్ : బండి సంజయ్ పాదయాత్ర పార్టీ భవిష్యత్తును మార్చేసింది. మూడుసార్లు ప్రధాని మోదీ సంజయ్ పాదయాత్ర గురించి వివరించారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది.. ఎప్పటికీ మరవం. నాలుగు నెలల తర్వాత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బై..బై చెబుతారు. తెలంగాణలో ఇళ్లను కేటాయించడం లేదు. ఈ సమస్యపై మేం పోరాటం చేస్తాం. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది బీజేపీ మాత్రమే. బీజేపీకి ఒక్కసారి ఓటేసి ఛాన్స్ ఇవ్వండి.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించండి. ఎన్నికల్లో గెలిచేందుకు అంతా కలిసి పనిచేద్దాం.
కిరణ్ కుమార్ రెడ్డి : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయం. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. బీఆర్ఎస్ కారు తాళాలు బీజేపీ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి నా వంతు కృషి చేస్తాను.
ధర్మపురి అర్వింద్ : బీజేపీకి తెలిసినంతగా రాజకీయం చేయడం ఎవరి తరం కాదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ప్రభుత్వం సునామీ సృష్టిస్తుంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. శివసేన, ఎన్సీపీ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టే విచ్ఛిన్నం అయ్యాయి. ఈటల రాజేందర్ గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేయాలి..? కేసీఆరే హుజూరాబాద్‌లో పోటీ చేయాలి. దమ్ముంటే కేసీఆర్ నాపై పోటీచేయాలి. తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తోంది.
విజయశాంతి ఇలా..
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ పరోక్ష విమర్శలు గుప్పించారు. కిరణ్ పేరెత్తకుండానే ఘాటు విమర్శలు గుప్పించారు. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లు స్టేజీపై ఉన్నారు. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారూ అక్కడ ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది’ అని విజయశాంతి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
డుమ్మా కొట్టిన నేతలు వీళ్లే..
కాగా.. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సభకు పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. ఏ.చంద్రశేఖర్, ఏనుగు రవీందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వీరంతా గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు బీజేపీ గుడ్ బై చెప్పేసి కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే.. వీరిని బుజ్జగించేందుకు స్వయంగా ఈటల రాజేందర్ రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చర్చలు ఫలించాయని అనుకున్నా.. ఇవాళ్టి సభకు ఏ ఒక్కరూ రాకపోవడం గమనార్హం.
కార్యక్రమంలో ఎవరేం మాట్లాడారో..? ఎవరేం సోషల్ మీడియాలో ఏమేం రాసుకొచ్చారో చూశారుగా.! బండి సంజయ్, కోమటిరెడ్డి కామెంట్స్‌తోనే బీజేపీ గ్రూపులు ఉన్నాయని బయటపడింది. అయితే ఈ క్రమంలో కిరణ్‌ను రాములమ్మ టార్గెట్ చేయడం ఇవన్నీ పెద్ద గందరగోళంగా మారాయి. ఇప్పుడీ వ్యవహారాలన్నీ బీజేపీలో చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఈ వ్యవహారాలపై ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!
TS Politics : గజ్వేల్‌కు గులాబీ బాస్ గుడ్ బై చెప్పేస్తున్నారా.. పరిశీలనలో రెండు నియోజకవర్గాలు.. ఆ సర్వే తర్వాత మారిన సీన్..!?
Rains lash Telangana : ఐటీ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..
TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..
Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?
Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?
Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!
TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!
BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్