Raghurama: వైసీపీ ఓడిపోవడం ఖాయం..
ABN , First Publish Date - 2023-03-07T22:59:25+05:30 IST
వైసీపీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Narsapuram YCP Rebel MP Raghuramakrishna Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు. వైసీపీ ఓడిపోవడానికి సరిపడంత ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు. జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉన్నప్పటీ కానీ తగ్గవలసినంత ఓటింగ్ శాతం తగ్గలేదని రఘురామ తెలిపారు. ప్రజల్లో కనిపిస్తున్నంత వ్యతిరేకత సర్వేల్లో కనిపించడం లేదని ఆయన అన్నారు. అవలీలగా అబద్ధాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి అదొక పెద్ద బలమని చెప్పారు. జగన్ చెప్పిన అబద్దాలను కొన్ని బ్లూ చానల్స్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
‘ఎన్నికలకు ముందు... మీకు కూలివాడిలాగా పనిచేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి’ అని బతిమాలిన వ్యక్తులు, ఇప్పుడు రాచరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏప్రిల్ నుంచి విశాఖ రాజధాని గా సీఎం జగన్ పరిపాలిస్తారని సుబ్బారెడ్డి చెబుతున్నారని, ఎవరికి వారే రాజులమని అనుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖలో రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, భవనాల పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రుషికొండపై కన్నేశారని, ఆయన కన్ను పడితే కొండలైనా కరిగిపోవాల్సిందేనన్నారు. రుషికొండపై 20వేల చదరపు మీటర్ల లోపు, దాదాపుగా 19వేల పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని తాను ఎన్జీటీ దృష్టికి తీసుకువెళ్లగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. రుషికొండ ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు నివేదిక అందజేయలేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టును మోసగిస్తూనే నిర్మాణాలను కొనసాగిస్తోందన్నారు. హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే, రుషికొండపై అదనపు స్థలంలో భవన నిర్మాణాలకు మునిసిపల్ శాఖ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని రఘురామరాజు ప్రశ్నించారు.
పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్ పల్లెల్లో నిద్రించకుండా, విశాఖపట్నానికి వచ్చి పడుకుంటారట అని రఘురామ ఎద్దేవా చేశారు. పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి ఏ పల్లెకు వెళ్లినా అక్కడ వృక్షాలన్నింటినీ నరికివేసే ప్రమాదం ఉందని చెప్పారు. తెనాలి సభలో జగన్కు వేసిన నెమలి పించాల దండ కోసం 20 నుంచి 25 నెమళ్ల ఈకలు పీకి ఉంటారన్నారు. జాతీయ పక్షి అయిన నెమలిని హింసించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరమని, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.