Share News

Year End 2023: ఈ ఏడాదంతా ఆస్ట్రేలియాదే.. విజయంతో ముగిస్తారా?

ABN , Publish Date - Dec 25 , 2023 | 03:51 PM

Year End 2023: క్రికెట్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. టెస్టుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డేల్లో ఐసీసీ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో 2023 ఆస్ట్రేలియాకు మరపురాని సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

Year End 2023: ఈ ఏడాదంతా ఆస్ట్రేలియాదే.. విజయంతో ముగిస్తారా?

మరో వారం రోజుల్లో క్యాలెండర్ ఇయర్‌లో 2023 కనుమరుగు కానుంది. క్రికెట్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. టెస్టుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డేల్లో ఐసీసీ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పైనే గెలిచి విజయం సాధించడం ఆస్ట్రేలియాకు గర్వకారణంగా నిలిచింది. అంతేకాకుండా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో 2023 ఆస్ట్రేలియాకు మరపురాని సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

మరోవైపు మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌లోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు సత్తా చాటారు. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ డిమాండ్ కనిపించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది. ఇక మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియా టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా మహిళలు గెలుచుకున్నారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

పురుషుల జట్టు విషయానికి వస్తే .. ప్రస్తుతం సొంతగడ్డపై పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ ఏడాది పాకిస్థాన్ ఎక్కువ టెస్ట్ క్రికెట్ ఆడలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఘోర పరాజయం ఎదురైంది. తాజాగా బాక్సింగ్ డే టెస్టు కోసం పాకిస్థాన్ జట్టు మెల్‌బోర్న్ చేరుకుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పాకిస్థాన్ భావిస్తుండగా.. తమకు కలిసొచ్చిన ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 03:51 PM