Share News

ODI World Cup: బీసీసీఐపై మ్యాక్స్‌వెల్ ఆగ్రహం.. మ్యాచ్ మధ్యలో ఇలాంటి షోలు అవసరమా?

ABN , First Publish Date - 2023-10-26T16:40:05+05:30 IST

ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామంలో నైట్ క్లబ్ తరహాలో లైట్ షోలు ఏర్పాటు చేయడం చెత్త నిర్ణయమని మండిపడ్డాడు.

ODI World Cup: బీసీసీఐపై మ్యాక్స్‌వెల్ ఆగ్రహం.. మ్యాచ్ మధ్యలో ఇలాంటి షోలు అవసరమా?

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను కైవసం చేసుకుంది. బుధవారం పసికూన నెదర్లాండ్స్‌పై తనదైన శైలిలో రెచ్చిపోయింది. దీంతో ఏకంగా 309 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయినా ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామంలో నైట్ క్లబ్ తరహాలో లైట్ షోలు ఏర్పాటు చేయడం చెత్త నిర్ణయమని మండిపడ్డాడు. తనకు ఈ లైట్ షో వల్ల భయంకరమైన తలనొప్పి వచ్చిందని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.

ఇది కూడా చదవండి: World Cup: బుమ్ బుమ్ బుమ్రా.. ఈ వరల్డ్ కప్‌లో బుమ్రానే టాప్.. ఎందులో అంటే..?

ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు కూడా ఒకసారి పెర్త్‌లో ఇలాగే లైట్ షో ఏర్పాటు చేశారని.. అప్పుడే తనకు బాగా తలనొప్పి వచ్చేసిందని మ్యాక్స్‌వెల్ అన్నాడు. లైట్ షో ముగిసిన తర్వాత ఆటగాళ్ల కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని.. అందుకే మ్యాచ్ మధ్యలో లైట్ షో ఏర్పాటు చెత్త నిర్ణయంగా మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లైట్ షో ముగిసిన వెంటనే కళ్లు మూసుకుని చాలా ఇబ్బంది పడినట్లు మ్యాక్స్‌వెల్ కనిపించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ లైట్ షోలు నిర్వహించాలనే నిర్ణయంపై దుమ్మెత్తిపోశాడు. కాగా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు వినోదం అందించేందుకు బీసీసీఐ లైట్ షోలను ఏర్పాటు చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న ప్రతి మ్యాచులోనూ లైట్ షో నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-10-26T16:40:05+05:30 IST