ICC ODI Rankings: పాయింట్లు సమానం.. కానీ నంబర్‌వన్ జట్టుగా పాకిస్థాన్

ABN , First Publish Date - 2023-09-18T18:25:31+05:30 IST

ఆసియా కప్ గెలిచిన టీమిండియా అగ్రస్థానంలోకి వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా పాకిస్థాన్ జట్టు నంబర్‌వన్‌ జట్టుగా స్థానం సంపాదించింది.

ICC ODI Rankings: పాయింట్లు సమానం.. కానీ నంబర్‌వన్ జట్టుగా పాకిస్థాన్

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను ప్రకటించింది. ఆసియా కప్ గెలిచిన టీమిండియా అగ్రస్థానంలోకి వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా పాకిస్థాన్ జట్టు నంబర్‌వన్‌ జట్టుగా స్థానం సంపాదించింది. టీమిండియా, పాకిస్థాన్ ఖాతాల్లో 115 పాయింట్లు ఉన్నా ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఓటమితో టీమిండియా రెండో స్థానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకవేళ సొంతగడ్డపై ఈనెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ గెలిస్తే ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్ జట్టుగా టీమిండియా రికార్డు సాధించనుంది. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. టెస్టుల్లో 264 పాయింట్లతో, టీ20ల్లో 118 పాయింట్లతో భారత్ నంబర్‌వన్ జట్టుగా ఉంది.

మరోవైపు వన్డే ర్యాంకుల్లో మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియాకు రేటింగ్ పాయింట్ల తగ్గాయి. దీంతో ఆ జట్టు 113 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా కూడా టాప్ ర్యాంకుకు చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ 105 పాయింట్లతో ఐదో స్థానంలో, న్యూజిలాండ్ 100 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ ర్యాంకుల్లో కిందకు దిగజారింది. ః

ఇది కూడా చదవండి: Team India: టీమిండియాపై పాకిస్థాన్ లెజెండ్ ప్రశంసలు.. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తారేమో..!!

అటు బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (863 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 759 పాయింట్లతో రెండో స్థానంలో, దక్షిణఫ్రికా బ్యాటర్ వాండర్ డసెన్ 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బౌలర్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు జాష్ హేజిల్‌వుడ్ 692 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ రెండో స్థానం ఆక్రమించాడు. టాప్-10లో ఇండియా నుంచి కుల్‌దీప్ ఒక్కడే ఉన్నాడు. 656 పాయింట్లతో అతడు ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబుల్ హసన్ టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

Updated Date - 2023-09-18T18:25:31+05:30 IST