IPL 2023: కామెంట్రీ బాక్స్‌లో సందడి చేసిన నాగచైతన్య.. ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడేనట!
ABN , First Publish Date - 2023-04-21T20:06:11+05:30 IST
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య చేపాక్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య(Naga Chaitanya)
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య చేపాక్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య(Naga Chaitanya) సందడి చేశారు. కామెంట్రీ బాక్స్‌లో కల్యాణ్, వెంకటపతిరాజుతో కలిసి కనిపించిన నాగచైతన్య పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఎంఎస్ ధోనీ(MS Dhoni) అని చెప్పారు. మైదానంలో ధోనీ ఎంత ఒత్తిడిలో ఉన్నా చాలా కూల్‌గా కనిపిస్తాడని, అది తనకు చాలా బాగా నచ్చుతుందన్నారు. ఓ నటుడిగా అది తనకు కూడా ఉండాల్సిన ఎంతో ముఖ్యమైన క్వాలిటీ అని అన్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు సహనం ఎంతో అవసరమని అన్నారు. ధోనీలో ఉన్న ఆ గుణం తనకు ఎంతగానో నచ్చుతందని పేర్కొన్నారు.
చెన్నైలో చదువుకుంటున్నప్పుడు గల్లీ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడినని, ఆ టైంలో బ్యాటింగ్ కోసం చీటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అలాగే, మజిలీ సినిమా కోసం ప్రత్యేకంగా క్రికెట్లో శిక్షణ పొందినట్టు నాగచైతన్య తెలిపారు. ఆ మూవీ సమయంలో మూడు నాలుగు నెలలు క్రికెట్ కోచింగ్‌కు వెళ్లడం తనకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నారు. కోచింగ్‌లో బౌలింగ్ నేర్పించారు తప్పితే ఎక్కువగా బ్యాటింగే చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్-హైదరాబాద్ జట్లలో ఏది గెలవాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు చైతు తెలివిగా బదులిచ్చారు. ఇరు జట్లలోని మన ఆటగాళ్లు ఉన్నారని, కానీ బాగా ఆడిన జట్టే గెలుస్తుందని అన్నారు.
వెంకటపతిరాజు మాట్లాడుతూ.. అక్కినేని నాగార్జునతో తనకు అనుబంధం ఉందని, చాలాసార్లు ఆయనను కలిశానని చెప్పారు. కార్గిల్ మ్యాచ్ సమయంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నాగార్జున తొలి బంతికే తన చేతికి చిక్కి అవుటయ్యారని, దీంతో మళ్లీ బ్యాటింగ్ చేయమంటే నిరాకరించారని అన్నారు. ఈ సందర్భంగా కామెంటేటర్లు మాట్లాడుతూ.. చైతన్య మరిన్ని మంచి సినిమాలు చేయాలని, యూత్‌కు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.