Apple iPhones: హ్యాకర్లకు ఝలకిచ్చిన యాపిల్.. అత్యవసర సెక్యూరిటీ అప్డేట్స్ రిలీజ్
ABN , First Publish Date - 2023-09-08T17:05:53+05:30 IST
సెల్‌ఫోన్లలో సేఫ్టీ ఫీచర్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. హ్యాకర్లు ఎలాగోలా జనాలను బురిడీ కొట్టించి, సెల్‌ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. వినియోగదారుల విలువైన సమాచారాల్ని దొంగలించడంతో పాటు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు...
సెల్ఫోన్లలో సేఫ్టీ ఫీచర్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. హ్యాకర్లు ఎలాగోలా జనాలను బురిడీ కొట్టించి, సెల్‌ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. వినియోగదారుల విలువైన సమాచారాల్ని దొంగలించడంతో పాటు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఆఫర్లు, ఉద్యోగాల పేర్లతో లింకులు పంపించి.. యూజర్ల చేత ఆ లింకులు క్లిక్ చేసేలా చేసి.. మాల్వేర్‌లను సెల్‌ఫోన్‌లలో ప్లాంట్ చేసి.. సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సైబర్ ఎటాక్ పెచ్చుమీరిపోయాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ సంస్థ హ్యాకర్ల నుంచి తమ యూజర్లను రక్షించేందుకు కొన్ని అత్యవసర సెక్యూరిటీ అప్డేట్స్‌ని రిలీజ్ చేసింది. ఇంతవరకు తాను పసిగట్టలేని రెండు సెక్యూరిటీ సమస్యలను ఈ అప్డేట్స్ పరిష్కరించాయి.
వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నెట్, ప్రభుత్వ కార్యకలాపాలను చూసే ఒక గ్రూప్‌లో పని చేసే ఓ వ్యక్తి ఫోన్‌ని హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే.. ఈసారి ఈ హ్యాకర్లు ఓ అడుగు ముందుకేశారు. క్లిక్ గానీ, ట్యాప్ గానీ చేయకుండానే.. ఆటోమెటిక్‌గానే ఫోన్‌ని హ్యాక్ చేయాలని చూశారు. ఈ ప్లాన్‌లో భాగంగా హ్యాకర్లు ‘పెగాసస్’ అనే టూల్‌ని బాధితుల ఫోన్లలోకి ఎక్కిస్తారు. ఆ టూల్‌తో.. యూజర్ తన ఫోన్‌లో ఏం చేస్తాడన్న రహస్యాలన్నింటినీ చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ పెగాస్ టూల్ ఫోన్‌లో ఒక సీక్రెట్ కెమెరాలాగా పని చేస్తుంది. ఇంకేముంది.. అప్పుడు యూజర్‌కి తెలియకుండానే తన ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని హ్యాకర్లు సులభంగా దొంగలించేస్తారు. అప్పుడు బ్లాక్‌మెయిల్ చేయడం లేదా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు నొక్కేయడం చేస్తారు.
అదృష్టవశాత్తూ.. ఇంటర్నెట్‌లో జరిగే చెడు విషయాలపై ఓ కన్నేసి ఉంచే సిటిజన్ ల్యాబ్, ఐఫోన్‌లో ఉన్న ఈ సమస్యని గుర్తించింది. యూజర్‌కి తెలియకుండానే హ్యాకర్లు ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్స్‌లోకి ప్రవేశిస్తున్నారని విషయాన్ని కనుగొని.. యాపిల్ సంస్థకి ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో యాపిల్ సంస్థ వెంటనే అప్రమత్తమై.. ఆ సమస్యని పరిష్కరించేందుకు సరికొత్త సెక్యూరిటీ అప్డేట్‌ని సిద్ధం చేసి రిలీజ్ చేసింది. అంతేకాదు.. ఈ సమాచారం అందించినందుకు సిటిజన్ ల్యాబ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇదే సమయంలో.. యాపిల్ సంస్థ మరో సమస్యని కూడా కనుగొంది. ఆ సమస్య ఏమిటో బయటకు వెల్లడించలేదు కానీ.. ఈ రెండింటిని పరిష్కరించేందుకు గాను ఒకేసారి సెక్యూరిటీ అప్డేట్స్‌ని రిలీజ్ చేసి, యూజర్లకు మంచి రిలీఫ్ ఇచ్చింది.
గుడ్ న్యూస్ ఏమిటంటే.. హ్యాకర్లపై అనునిత్యం కన్నేసి ఉంచాలని ఈ సరికొత్త సమస్యలు తేల్చి చెప్పాయి. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే.. వెంటనే యాపిల్ సంస్థ విడుదల చేసిన సరికొత్త సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను అప్డేట్ చేసుకోవడం శ్రేయస్కరం. అప్పుడే హ్యాకర్ల బారిన పడకుండా సేఫ్‌గా ఉండొచ్చు. మరోవైపు.. ఈ స్పైయింగ్ టూల్‌ని (పెగాసస్‌ని) తయారుచేసిన చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్లు మాత్రం ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంది.