Somesh Kumar: గోస ఎప్పుడో ఓసారి మనకే తలుగుతది.. టీచర్ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్
ABN , First Publish Date - 2023-01-12T22:50:28+05:30 IST
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కువకాలం కొనసాగిన సీఎస్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోమేష్ కుమార్ (Somesh Kumar) అనూహ్య పరిణామాల మధ్య పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) రిలీవ్ కావాల్సి వచ్చింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కువకాలం కొనసాగిన సీఎస్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోమేష్ కుమార్ (Somesh Kumar) అనూహ్య పరిణామాల మధ్య పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) రిలీవ్ కావాల్సి వచ్చింది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులివ్వడం, వీటిని హైకోర్టు సమర్థించడం, క్యాట్ తీర్పు రద్దు, రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో వంటి పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. ఆఖరికి అయిష్టంగానే ఏపీ ప్రభుత్వం (AP Govt) వద్ద సోమేష్ కుమార్ రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఉన్నపళంగా జరిగిన ఈ పరిణామం ఆయనను బాధించిందని చెప్పక తప్పదు. ఉన్నతస్థాయి పరిపాలనాధికారులకు ఇలాంటి అనుభవాలు కొత్తమీ కాకపోయినప్పటికీ.. సోమేష్ కుమార్‌కు కర్మసిద్ధాంతం తెలిసొచ్చిందంటూ తానిపర్తి తిరుపతి రావు అనే ఉపాధ్యాయుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. 317 జీవో తీసుకొచ్చి ఉన్నపళంగా టీచర్లను కుటుంబాలకు దూరం చేసి బాధపెట్టారని, ఇప్పుడు తమ గోస తగిలిందని తిరుపతి రావు పేర్కొన్నాడు. కరీంనగర్ జిల్లాలోని వట్టిమళ్ళ ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతిరావు పోస్ట చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన ఏం రాసుకొచ్చారో ఒకసారి పరిశీలిద్దాం..
తిరుపతి రావు ఏం పోస్ట్ చేశారంటే..
‘‘ గౌరవనీయులైన మీకు నమస్కరించి రాయునది !
మీకు కర్మ సిద్దాంతం అంటే ఏమిటో తెలుసా ? మీరు #317 జీవోతో మమ్ములను ఉన్నపలంగా బదిలీ చేస్తిరి ! ఉన్నకాడ మంచిగా సెట్టై ఉన్న మమ్ములను మా కుటుంబాలకు దూరం చేస్తిరి ! మా ఊరికి దూరం చేస్తిరి ! మా జిల్లాకు దూరం చేస్తిరి ! అన్నింటికి మమ్ములను దూరం దూరం చేస్తిరి ! ఇది అన్యాయం ! ఉద్యోగుల విభజన ఇట్ల కాదు ! సర్వీసు బుక్కులో ఉన్నవిధంగా స్థానికతను పరిశీలించండి అని అడిగినం ! అలా కుదురది.. క్యాడర్ సీనియారిటి అంటిరి ! సరే అట్లైతే ఫీడర్ క్యాడర్‌ను కూడా లెక్కించండి అని అడిగినం ! లేదు లేదు న్యాయపరమైన చిక్కులు వస్తయ్ అని అంటిరి ! మేము చేసేది లేక మాకు న్యాయం చేయండి అని కోర్టుకు పోయినం ! అప్పుడు కోర్టు మాకు ఏ తీర్పు ఇచ్చిందో మీకు ఇప్పుడు అదే తీర్పు ఇచ్చింది ! మీరు మమ్ములను బలవంతంగా ఎట్ల బదిలీ చేసిండ్రో కోర్టు మిమ్ములను కూడా అట్లనే బదిలీ చేసింది ! అగో దీనినే కర్మ సిద్దాంతం అంటరు ! మనం ఎవ్వరిని కూడా గోసపుచ్చుకోవద్దు ! అట్ల చేస్తే ఆ గోస ఎప్పుడో ఓసారి మనకే తలుగుతది అని కర్మ సిద్దాంతం సారాంశం ! అప్పుడు మేము ఎంత బాద అనుభవించామో మీకు తెలుసా ? మా దినచర్య ఎంత డిస్టర్ అయ్యిదో మీకు తెలుసా ? మీరు పెద్ద ఉద్యోగులు ! మీరు ఎక్కడికి బదిలీ అయినా మీకు ఓ పెద్ద బంగ్లా ఇస్తరు ! కాబట్టి మీరు ఎక్కడంటే అక్కడ హాయిగా కాపురం పెట్టవచ్చు ! మరి మా పరిస్థితి ? సరే జిల్లాలకు బదిలీ చేస్తే చేస్తిరి ! అక్కడికి పోయినంక మా పుండు మీద కారం చల్లినట్లు దగ్గరి దగ్గరి పోస్టులను బ్లాక్ చేస్తిరి ! చేసేది లేక మీ ఆదేశాలను పాటించి మాకు ఇచ్చిన చోటుకి పోయి జాయిన్ అయినం ! మొదట్లో బాదపడ్డ ఇప్పుడు సర్దుకుపోయినం ! యాడాది గడిచిందో లేదో కోర్టు మిమ్ములను నిర్దాక్షిణ్యంగా బదిలీ చేయడం పట్ల మాకు ఎంతమాత్రం సంతోషం లేదు ! సాటి ఉద్యోగిగా మీకు నా సానుభూతి తెలియజేస్తున్న ! మీరు ఆ రాష్ట్రానికి పోయి వాళ్ళకు లేని పోని సలహాలు ఇవ్వకండి ! ప్లీజ్ !
ఇట్లు
తానిపర్తి తిరుపతి రావు
#317 జీవో బాదితుడు ’’ అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ఉపాధ్యాయులను కలవరానికి గురిచేసిన విషయం తెలిసిందే. కొత్త జోనల్ విధానంలో ఒకేసారి చేపడుతున్న బదిలీలతో విద్యాశాఖలో పనిచేస్తున్న వారికి ఎక్కువగా నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యతిరేకించారు. జిల్లాల కేటాయింపులో స్థానికతను పరిగణించకుండా బదిలీలు ఎలా చేస్తారని నిరసన తెలిపారు. సీనియారిటీని కాకుండా స్థానికతనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు చేసిన విషయం తెలిసిందే.