Share News

Revanth Reddy: గులాబీ జెండాతో ఎంట్రీ ఇచ్చి.. అదే పార్టీని గద్దె దించిన వైనం!

ABN , First Publish Date - 2023-12-06T11:22:41+05:30 IST

అనుముల రేవంత్‌రెడ్డి.. రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరిది! రాజకీయ అరంగేట్రంలోనే సంచలనాలు! నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. రాజకీయ

Revanth Reddy: గులాబీ జెండాతో ఎంట్రీ ఇచ్చి.. అదే పార్టీని గద్దె దించిన వైనం!

  • అతడే ఒక సైన్యం!

  • జడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఇలా సాగింది!

  • గులాబీ జెండాతో రాజకీయ అరంగేట్రం..

  • అదే పార్టీని గద్దె దించిన వైనం

  • 22 ఏళ్లకే ప్రేమ.. 24కే పెళ్లి

  • రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకే సీఎం

  • దూకుడు స్వభావం.. మాటకారి..!

  • ఇదీ అనుముల రేవంత్‌రెడ్డి ప్రస్థానం

అనుముల రేవంత్‌రెడ్డి.. రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరిది! రాజకీయ అరంగేట్రంలోనే సంచలనాలు! నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి, కేవలం 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. తొలుత టీఆర్‌ఎ్‌స(ప్రస్తుతం బీఆర్‌ఎ్‌స)లో పనిచేసిన రేవంత్‌.. తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పార్టీ సర్కారునే గద్దె దించి, ఏకంగా సీఎం అయిపోయారు!

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వంగూరు/నాగర్‌కర్నూలు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబరు 8న నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్‌ జన్మించారు. రేవంత్‌కు ఏడుగురు సొదరులు. ఒక సోదరి ఉన్నారు. ప్రాథమిక విద్య అంతా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చదివారు.. చిన్నతనంలో ఆరెస్సెస్‌ నేపథ్యంతో.. డిగ్రీ చేస్తున్న సమయంలో ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం ఓయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తిచేసి, ఆర్టిస్టుగా మారారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ను నిర్వహించారు. ఆ రెండింటిలోనూ సక్సెస్‌ అయ్యాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు.

re-1.jpg

ప్రేమ వివాహం

రేవంత్‌ది ప్రేమ వివాహం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన దివంగత జైపాల్‌రెడ్డి తమ్ముడు పురుషోత్తమరెడ్డి కుమార్తె గీతారెడ్డిని రేవంత్‌ ప్రేమించారు. అప్పుడామె ఇంటర్‌ చదువుతున్నారు. అనంతరం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. డిగ్రీ పూర్తయ్యాక.. పెద్దలను ఒప్పించి, 1992లో రేవంత్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు రేవంత్‌ వయసు 24 ఏళ్లు. వారికో కుమార్తె(నైమిషారెడ్డి) ఉన్నారు.

నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి..

కాంగ్రె్‌సలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న సమయంలో.. ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితులుండగా అందరినీ ఒకేతాటిపైకి తెచ్చే బాధ్యతలను తన భుజస్కంధాలపైకి ఎక్కించుకున్నారు రేవంత్‌. ఆ మహా క్రతువులో విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ఎస్టాబ్లిష్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసే వారంతా.. కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించేలా చేయడంలోనూ సఫలమయ్యారు.

2REVANTH1.jpg

విషయ పరిజ్ఞాని..

రేవంత్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఏదైనా అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే.. దానిపై అధ్యయనం చేస్తారు. అందుకు సంబంధించిన పుస్తకాలను చదువుతారు. చదివినదానిని ఒంటబట్టించుకుంటారు. సబ్జెక్టుపై పట్టు సాఽధిస్తారు. దాంతో ఆ అంశంపై అవలీలగా మాట్లాడేస్తారు. రేవంత్‌ మంచి మాటకారి కూడా. ప్రజలకు అర్థమయ్యేలా.. వారి భాషలో.. వారి యాసలో చెప్పడంలో రేవంత్‌ దిట్ట. అలాగే తన ప్రసంగంలో ఎక్కడా కూడా సోది లేకుండా సూటిగా స్పష్టంగా విషయాన్ని చెప్పేస్తారు. అందుకే ప్రజలకు ఇట్టే కనెక్ట్‌ అవుతారు. మాస్‌ ఫాలోయింగ్‌ పెరగడానికి కూడా అదే కారణం. అలా రేవంత్‌ జనాకర్షక నేతగా ఎదిగారు. రేవంత్‌ ఆకలికి అస్సలు ఆగలేరు. వేళకు భోజనం చేయడానికే ప్రాఽధాన్యతనిస్తారు.

జీవితంలో ఆటుపోట్లెన్నో..!

రేవంత్‌ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ వచ్చినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే.. డబ్బుకోసం ఇంటి నుంచి ఆశించకుండా, తన సంపాదనపైనే దృష్టిసారించారు. ఓ పార్టీ పత్రికలో విలేకరిగా, ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రింటింగ్‌ రంగం, ముఖ్యంగా ఆ రోజుల్లో పాపులర్‌ అయిన స్ర్కీన్‌ప్రింటింగ్‌పై పట్టు సాధించారు. అప్పట్లో హైదరాబాద్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ రంగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారి ముద్ర బలంగా ఉండేది. వారిలో రేవంత్‌ కూడా ఒకరిగా ఎదిగారు.

మామను మించిన అల్లుడు

రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో మామ జైపాల్‌రెడ్డిని మించిన అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి జైపాల్‌రెడ్డి తాను ఏదో ఒకరోజు రాష్ట్రానికి సీఎం అవుతానని చెబుతుండేవారు. కేంద్ర మంత్రి వరకు ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన జైపాల్‌రెడ్డి సీఎం కావాలని కలలుగన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు సీఎం అయ్యే చాన్స్‌ దక్కినట్లే దక్కి.. చేజారిన సందర్భాలెన్నో. అందుకు జైపాల్‌రెడ్డి మనస్తత్వం కూడా ఓ కారణమే..! పదవి అనేది దానంతట అదే వస్తే తీసుకోవడం తప్ప.. సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. కాంగ్రెస్‌ పదవుల విషయంలోనూ అంతే..! అయితే.. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డి మాత్రం.. కాంగ్రె్‌సలో చేరిన అనతికాలంలోనే టీపీసీసీలో భాగమయ్యారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్‌ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. అయితే.. జైపాల్‌రెడ్డి విషయంలో కలగానే మిగిలిన సీఎం పదవి, రేవంత్‌కు దక్కడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

ld.jpg

రాజకీయ ప్రస్థానం

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎ్‌స(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) పట్ల ఆకర్షితులై.. కల్వకుర్తి టికెట్‌ను ఆశిస్తూ 2004లో ఆ పార్టీలో చేరారు. టికెట్‌ దక్కకపోవడంతో 2006లో మిడ్జిల్‌ మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007 మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి, చంద్రబాబుకు బాగా దగ్గరయ్యారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్‌ నుంచి చివరి నిమిషంలో టికెట్‌ లభించింది. 17 రోజుల ప్రచారపర్వంలో ప్రజలకు చేరువై.. అప్పటి కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిపై విజయం సాఽధించారు. 2014లో మళ్లీ అక్కడి నుంచే గెలుపొందారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 20014-17 వరకు టీడీఎల్పీ నేతగా పనిచేశారు. 2015లో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. కొద్దిరోజులు జైల్లో ఉన్నారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రె్‌సలో చేరారు. 2018లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి, ఓటమి పాలయ్యారు. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి, 30 వేల మెజారిటీతో గెలుపొందారు. 2021 జూన్‌ 25న రేవంత్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటించింది. అదే ఏడాది జూలై 7న బాధ్యతలను స్వీకరించిన రేవంత్‌.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

1revfam-(2).jpg

సోదరులే ఆయన బలగం

రేవంత్‌రెడ్డి జీవితంలో గానీ, రాజకీయాల్లో గానీ అంచెలంచెలుగా ఎదగడానికి ఓ బలగం గట్టి మద్దతుంది. ఆయన సోదరులే ఆయనకు బలమైన బలగం..! కష్టసుఖాల్లో రేవంత్‌కు వెన్నంటే ఉన్నారు వారు. రేవంత్‌కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉండగా.. పెద్దన్న భూపాల్‌రెడ్డి ఎస్సైగా పనిచేశారు. రెండో సోదరుడు కృష్ణారెడ్డి స్థానిక సర్పంచ్‌గా సేవలందించారు. రేవంత్‌ సోదరి సుమతమ్మ జంగారెడ్డిపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. మరో సోదరుడు తిరుపతిరెడ్డి వ్యాపారి. ప్రస్తుతం కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌ విజయాల వెనక తిరుపతిరెడ్డి పాత్ర కీలకం. ఇంకో సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలున్నాయి. మరో ఇద్దరు సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరూ రేవంత్‌ వ్యవహారాలను చక్కబెడుతుంటారు. కొండల్‌రెడ్డి కూడా కొంతకాలం అమెరికాలో ఉండివచ్చారు. ఆయనకు రాజకీయ సంబంధాలు ఎక్కువ. కామారెడ్డిలో రేవంత్‌ ప్రచార బాధ్యతలను కొండల్‌రెడ్డి భుజాలకెత్తుకున్నారు. చూడ్డానికి ఆయన అచ్చం రేవంత్‌ పోలికలతో ఉంటారు. రేవంత్‌ మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తారు.

1jaipal.jpg

తొలుత జైపాల్‌రెడ్డి వ్యతిరేకం!

తన సోదరుడి కూతురిని పెళ్లి చేసుకున్న రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రావడాన్ని జైపాల్‌రెడ్డి మొదట్లో ఇష్టపడలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రేవంత్‌ జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించాక.. ఆయన్ను కల్వకుర్తి రాజకీయాల్లో కీలకంగా మార్చనున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా జైపాల్‌రెడ్డి కొంత విసురు సమాధానం ఇచ్చారు. ‘‘గుర్రాన్ని.. గాడిదను ఒకే గాటాన కడతారా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు. ఈ విషయంతో కొంత నొచ్చుకున్న రేవంత్‌రెడ్డి.. అప్పట్లోనే పార్లమెంట్‌లో అడుగు పెడతానని, తన గళాన్ని వినిపిస్తానని శపథం చేశారు. అనుకున్నట్లుగానే ఆయన మల్కాజిగిరి ఎంపీ అయ్యారు. జైపాల్‌రెడ్డి చనిపోవడానికి ముందు రేవంత్‌ను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం..!

‘‘నా లాంటి మేధావి రాజకీయాల్లో రాణించలేడు. ఈ తరానికి రేవంత్‌ లాంటి ఫైర్‌బ్రాండ్‌ కావాలి’’

- రేవంత్‌ గురించి కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి

1reven9f.jpg

2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి తీసుకెళ్తున్నప్పుడు.. తాను పులిలా తిరిగి వస్తానంటూ కేసీఆర్‌ను హెచ్చరిస్తూ రేవంత్‌ రెడ్డి మీసం మెలేసిన దృశ్యం.

cm-revanth.jpg

Updated Date - 2023-12-06T12:44:18+05:30 IST