CP Sudhir Babu: సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు.. డ్రగ్స్‌పై మరింత నిఘా
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:22 PM
నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను
- కనీసం 15 నిమిషాలు ప్రజల మధ్య తిరగాలి
- రాచకొండ సీపీ సుధీర్‌బాబు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) అన్నారు. కమిషనరేట్‌లో శనివారం డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్థుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలన్నారు ముఖ్యంగా సివిల్ వివాదాలలో పోలీసులు తలదూర్చకూడదని, నిర్దిష్ట ఎస్‌ఓపీ ప్రకారమే నడుచుకోవాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. రోజు కనీసం 15 నిమిషాలు తమ స్టేషన్ పరిధిలో ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకం కావాలని సూచించారు. చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ఠ శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం మీద నిఘా పెంచాలన్నారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తరుణ్ జోషీ, డీసీపీలు అనూరాధ, రాజేష్ చంద్ర, శ్రీనివాస్, జానకి, శ్రీ బాల, ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస రెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.