Telugu States: ఓం నమ:శివాయా... ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న శైవక్షేత్రాలు

ABN , First Publish Date - 2023-02-18T10:21:32+05:30 IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Telugu States: ఓం నమ:శివాయా... ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న శైవక్షేత్రాలు

అమరావతి/హైదరాబాద్: మహాశివరాత్రి (MahaShivratri) ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తుల (Devotees)తో కిటకిటలాడుతున్నాయి. ఓం నమ:శివాయా అంటూ శివాలయాలు (Lord Shiva Temples)మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి శివుడుని దర్శించుకుంటున్నారు. హర హర మహాదేవ... శంభో శంకరా అంటూ ఆ దేవదేవుడిని మనస్సులో నింపుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివున్ని స్మరిస్తూ ఉపావాసం చేస్తారు. సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపావాసాన్ని విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడిని స్మరించుకోనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీశైలం (Srisailam), మహానంది (Mahanandi), కోటప్పకొండ (Kotappakonda), శ్రీకాళహస్తి (Srikalahasti), పంచారామక్షేత్రం (Pancharamam), యాగంటి (Yaganti), వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Rajanna Temple), వేయిస్తంభాల గుడి (Thousand pillared temple), రామప్ప ఆలయం (Ramappa Temple), ఏడుపాయల వనదుర్గామాత ఆలయం( Vanadurga Mata Temple) తదితర ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే ఆ బోలా శంకరుడిని దర్శించుకునేందుకు ఆయా ఆలయాల్లో భక్తులు క్యూలైన్లు కట్టారు. శంభో శంకరా అంటూ మహాశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ :

నంద్యాల: జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి భక్తజనం పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతోంది. శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. అటు పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి పాగాలంకరన, కళ్యాణోత్సవం చేయనున్నారు. ఇవాళ ఒక్కరోజే రెండు లక్షల మంది భక్తులు శ్రీశైలం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • అటు యాగంటి, కాల్వబుగ్గ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కోనేర్లలో పుణ్యస్నానాలు చేసి పరమశివుడిని దర్శించుకుంటున్నారు.

  • మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం శేష వాహనం, సాయంత్రం నంది వాహనంపై భక్తులకు స్వామి, అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగనుంది. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. రాత్రి జాగరణ సందర్భంగా ఆలయ పరిసరాలలో సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పల్నాడు: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీగా బిందె తీర్థం తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. త్రికోటేశ్వరునికి అభిషేకాలతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే త్రికోటేశ్వరుని దర్శనాలకు భక్తులను అనుమతిచ్చారు.

  • అటు పంచారామ క్షేత్రం అమరావతిలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే అమరేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి , శనిత్రయోదశి ఒకే రోజు రావటం విశేషం. ముందుగా శనీశ్వరునికి, ఆ తర్వాత ఈశ్వరునికి అభిషేకాలు చేస్తే సకల పాపాలు తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

గుంటూరు: జిల్లాలోని శైవ క్షేత్రాలలో శివరాత్రి సందడి నెలకొంది. పెదకాకాని, క్వారీ, గోవాడ, చేజెర్ల, దైదా, సత్రశాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

రాజమండ్రి: మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. స్నాన ఘట్టాలు భక్తులతో పోటెత్తాయి. శైవక్షేత్రాల్లో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

విజయవాడ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచే నది స్నానాలను ఆచరించి మూడు గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో భక్తులు వేచి ఉన్నారు. ఓం నమ:శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పంచారామ క్షేత్రాలు, శైవక్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. ఈరోజు స్వామివారికి శివకళ్యాణంతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురులో ప్రబల సందడి నెలకొంది. శివరాత్రి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి శివుని భక్తులు స్మరించుకుంటున్నారు.

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు అధికారులు దర్శన సదుపాయం కల్పించారు. సర్వదర్శనంతో పాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనం కల్పించారు. సర్వదర్శనం, రూ.50 టికెట్ ద్వారా వెళుతున్న భక్తులకు ప్రస్తుతం దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. స్వామి అమ్మవార్లు దర్శనంలో వీఐపీలకు పెద్దపేట వేస్తున్నారని సామాన్య భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలోని శ్రీపార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

  • పెనుమంట్ర మండలం జుత్తిగలోని శ్రీ ఉమావాసుకిరవి సోమేశ్వర స్వామి వారి కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

  • భీమవరంలో పంచారామ క్షేత్రం సోమారామం శివనామస్మరణతో మార్మోగుతోంది. మహాశివరాత్రి, శనిత్రయోదశి కావడంతో భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. సోమేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

  • తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో శైవక్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్పటిక లింగ దర్శనానికి పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చారు. మంత్రి కొట్టు సత్యనారాయణ స్పటిక లింగానికి అభిషేకం నిర్వహించారు.

ఏలూరు: శివరాత్రిని పురస్కరించుకుని పోలవరం మండలం పట్టిసీమ శైవక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అఖండ గోదావరి మధ్యలో వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. వంశపారంపర్య ధర్మకర్తలు గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం, తొలి పూజలు నిర్వహించారు. ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నినాదాలతో పట్టిసీమ మారుమోగుతోంది.

తూర్పుగోదావరి: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి నది తీరం భక్తజనసంద్రంగా మారింది. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి, శనివారం, శనిత్రయోదశి కావడంతో భక్తులు పోటెత్తారు.

ప్రకాశం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • ఒంగోలులోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, సంతపేట సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో అభిషేకాలు, దర్శనాలకు భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

తెలంగాణ:

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో దక్షిణ కాశీ మారుమోగుతోంది. మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

వరంగల్: జిల్లాల్లోని శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేయిస్తంబాల దేవాలయం, రామప్ప టెంపుల్, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నుంచి మూడు రోజులపాటు జాతర జరుగునుంది. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జాతర నేపథ్యంలో హైదరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరు మండలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

  • మహాశివరాత్రి సందర్భంగా కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, సుజాతనగర్ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • భద్రాచలం పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బూర్గంపాడు మండలం మోతె గడ్డ ఆత్మలింగేశ్వరస్వామి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పాల్వంచలో కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహశివరాత్రి పర్వదినం రోజున శివలింగంపై పడే సూర్య కిరణాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నల్గొండ శివారు పానగల్‌ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, చెర్వుగట్టు ఆలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది.

  • సూర్యాపేట జిల్లాలోని చారిత్రక కాకతీయుల శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం, వాడపల్లి అగస్తీశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాదాగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బాసర, బ్రహ్మపురి, సోన్, ఖానాపూర్, కలమడుగు, మంచిర్యాల, చెన్నూరు గోదావరి తీరాల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్నాయి.

మంచిర్యాల: శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేలాల గట్టు మల్లన్న, కత్తరశాల మల్లి ఖార్జున స్వామి ఆలయాల్లో మహా శివరాత్రి జాతర మొదలైంది. వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

కొమురం భీం: ఈస్ గాం శివ మల్లన్న ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

నిజామాబాద్: మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నిజామాబాద్ కంఠేశ్వర్, బోధన్ ఏక చక్రేశ్వర్, బిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం, మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయం, బండ రామేశ్వర్ పల్లి శివాలయం, కామారెడ్డి లోని ఓంకారేశ్వరాలయాల్లో భక్తులు పోటెత్తారు.

ఖమ్మం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేశారు. నీలాద్రీశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఖమ్మం నగరంలోని స్వయంభు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలలో స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. కొమురవెళ్లి, కోటిలింగాల, పోట్లపల్లి, శరభేశ్వర ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో శివుడికి ఉదయం నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వేములవాడ కామన్ వద్ద శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-02-18T10:31:26+05:30 IST