Share News

Revanth Reddy wife Gita: అందుకే రేవంత్ నచ్చారు!.. మా ప్రేమ కథ అలా మొదలైంది..

ABN , First Publish Date - 2023-12-04T05:07:11+05:30 IST

ఢిల్లీకి రాజైనా.. ఇంట్లో మాత్రం పిల్లలకు తండ్రే! భార్యకు భర్తే! ఓ సగటు కుటుంబ పెద్దే!! పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు ముగింపు పలికి..

Revanth Reddy wife Gita: అందుకే రేవంత్ నచ్చారు!.. మా ప్రేమ కథ అలా మొదలైంది..

ఎన్టీఆర్‌లా ఆయనా ముక్కుసూటి మనిషి.. ప్రజలకు మేలు చేయాలనే తపన ఎక్కువ

ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో చేస్తారు

అందులో తన మార్కు ఉండాలనుకుంటారు

ప్రెస్‌మీట్‌ అయినా.. అసెంబ్లీలో చర్చ అయినా

ఆయా అంశాలపై స్టడీ చేయకుండా వెళ్లరు

ఆయనకు ఆ విషయంలో నేనూ సహకరిస్తా

రేవంత్‌ గురించి ఆయన సతీమణి గీత వెల్లడి

ఢిల్లీకి రాజైనా.. ఇంట్లో మాత్రం పిల్లలకు తండ్రే! భార్యకు భర్తే! ఓ సగటు కుటుంబ పెద్దే!! పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు ముగింపు పలికి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదు. రాజకీయాల్లో ఇంత దూకుడుగా ఉండే ఆయన.. ఇంట్లో ఎలా ఉంటారు.. కుటుంబంతో ఆయన అనుబంధం గురించి, ఆయన వ్యక్తిత్వం, కష్టపడేతత్వం.. వీటన్నిటి గురించి రేవంత్‌ సతీమణి గీత పలు సందర్భాల్లో మీడియాకు తెలిపారు. వాటిలో ముఖ్యాంశాలు...

రేవంత్‌ తొలుత విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు. పెళ్లికి ముందు కొన్నాళ్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ వ్యాపారం చేశారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలో ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం పెళ్లయిన తర్వాతే. పెళ్లికి ముందు.. రాజకీయాల్లోకి వెళ్లొద్దని రేవంత్‌కు చెప్పాన్నేను. ‘చూద్దాంలే’ అన్నారాయన. ఆ మాటంటే రాజకీయాల్లోకి వెళ్లరేమో అనుకున్నాను. పెళ్లయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తుచేస్తే.. ‘నేను వెళ్లననలేదు. చూద్దాంలే అన్నాను’ అని గుర్తుచేశారు. నాకు అప్పట్లోనే ఆయన మాటకారితనం అర్థమైంది.

మాది ప్రేమ పెళ్లి. ఇంటర్మీడియట్‌ నుంచి మా ప్రేమ కథ మొదలైంది. మొట్టమొదటిసారి మేం నాగార్జునసాగర్‌లో.. నాగార్జున కొండకు వెళ్లే బోట్‌లో కలిశాం. తను మా కజిన్‌కి ఫ్రెండ్‌. అలా పరిచయం. వాళ్లింటికి వస్తూ పోతూ ఉండగా పరిచయం పెరిగింది. తర్వాత్తర్వాత కలిసి మాట్లాడిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ బాగా నచ్చాయి నాకు. చాలా ముక్కుసూటి మనిషి. ‘అవును.. కాదు.. నా అభిప్రాయం ఇది. నా లక్ష్యం ఇది.. నేనిది చేయాలనుకుంటున్నాను’ అని స్పష్టంగా చెబుతారు. అది నాకు బాగా నచ్చేది. కాలక్రమంలో మా పరిచయం ప్రేమగా మారింది. రేవంతే ప్రపోజ్‌ చేశారు. అయితే మొదట్లో ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అప్పటికి రేవంత్‌ ఇంకా జీవితంలో సెటిల్‌ కాలేదు. ఆర్థికస్థితిలో తేడాలున్నాయి. అయితే డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో మా పెళ్లయింది. మా అమ్మకి రేవంత్‌ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరి ఆలోచనావిధానం ఒకే తరహాలో ఉంటుంది.


వ్యాపారాలన్నీ ఆపేసి రాజకీయాల్లోకి వెళ్తానని రేవంత్‌ అనడం నాకు ఇష్టం ఉండేది కాదు. అలాగని ద్వేషమేమీ లేదుగానీ.. ‘వ్యాపారంలో బాగానే ఉన్నాం కదా? రాజకీయాల్లోకి వెళ్లి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం దేనికి? అక్కడికి వెళ్లి మళ్లీ తనను తాను నిరూపించుకోవాలి కదా’ అనిపించేది. కానీ, అది రేవంత్‌ జీవితలక్ష్యం కావడంతో సహకరించాను.

రేవంత్‌ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు చాలా టెన్షన్‌ పడ్డాను. ఎందుకంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. అప్పుడు నిరూపించుకోలేకపోతే జీవితంలో ఒక మెట్టు దిగినట్టే. దీంతో చాలా టెన్షన్‌ పడ్డా. రాత్రంతా నిద్దరపట్టలేదు. గెలిచిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలవి.

రేవంత్‌ మీడియా ముందు మాట్లాడాలన్నా, విలేకరుల సమావేశం ఉందన్నా దానికి ఎంతో కొంత స్టడీ చేయకుండా వెళ్లరు. అసెంబ్లీలో ఏదైనా ప్రశ్న ఉన్నా, చర్చ ఉన్నా.. దాని కోసం రాత్రి ఎంతయినా చదువుతుంటారు. దాన్ని తేలిగ్గా తీసుకోరు. నేను కూడా కొంత సహాయం చేస్తాను. ఆయన చెబుతుంటే నేను రన్నింగ్‌ నోట్స్‌, బుల్లెట్‌ పాయింట్స్‌ రాస్తాను.

రాజకీయ రంగంలో విమర్శలు ఎక్కువగా ఉండడం సహజమే. అందులో రేవంత్‌ ఇంకొంచెం ఎక్కువ దూకుడుగా ఉంటారు. కొంచెం ఎక్కువగా విమర్శిస్తారు కాబట్టి.. ఆ సమస్య మాకు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయన మీద ఎవరైనా ఏదైనా విమర్శ చేసినప్పుడు.. ఆయన గురించి మనకు నిజాలు తెలుసు కాబట్టి, తేలిగ్గానే తీసుకుంటాంగానీ.. కొంతమందైనా నమ్ముతారేమోనని బాధ వేస్తుంది. విమర్శలు మన వ్యక్తిత్వాన్ని చంపే విధంగా ఉండకూడదు.

తనకు టైముంటే కుటుంబంతో ఎక్కువగా గడుపుతారు. ఏ కాస్త సమయం దొరికినా మాతో కలిసి ఉండాలనుకుంటారు. టూర్లకు వెళ్లడం తక్కువేగానీ.. సినిమాలు బాగా చూస్తాం. నెలకు రెండు, మూడు సినిమాలకు వెళ్తాం.

నాకు ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఆయన ఏదైనా చేయాలనుకుంటే.. ‘ఓడిపోతానా? గెలుస్తానా?’ అని ఆలోచించకుండా.. ఎవరు అడ్డుచెప్పినా.. ఆగకుండా ఓపెన్‌గా, ముక్కుసూటిగా ముందుకెళ్లిపోయేవారు. ఆయనలో ఉన్న ముక్కుసూటితనం.. ప్రజలకు మేలు చేయాలనే తపన.. రేవంత్‌లో కూడా ఉండడం వల్లనో ఏమో నాకు బాగా నచ్చారు.

రేవంత్‌లో ఉండే ఆత్మవిశ్వాసం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా ఒక పని చేపడితే.. ‘నేనిది చేయగలను’ అన్న నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టు హార్డ్‌వర్క్‌ బాగా చేస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడరు. ధైర్యంగా ఉంటారు. ఆ సమయంలో ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. చాలా షార్ప్‌ అయిపోతారు. నేను అలా కాదు. ఇక నచ్చని విషయాలంటే.. అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కూర్చుంటారు. పేపర్‌ చదువుతారు. తెల్లారి లేచి, నిద్ర సరిపోలేదని బాధపడతారు.

Updated Date - 2023-12-04T08:33:41+05:30 IST