Share News

RAIN : ఇక రా.. వానా...!

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:45 PM

ఖరీఫ్‌ విత్తన సాగుకు మృగశిర కార్తె తరువాత పునర్వసు అనుకూలమని రైతులు విశ్వసిస్తారు. ఈ కార్తెలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటారు. ఈనెల 21తో మృగశిర కార్తె ముగిసింది. ఆలోగా పదును వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడ్డాయి. దీంతో 5,800 హెక్టార్లలో పంట సాగైంది. పునర్వసు కార్తె వచ్చే నెల 5న మొదలౌతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో దుక్కి దున్ని.. పొలాలను సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ, కంది తదితర విత్తనాలను సైతం తగినన్ని సమకూర్చుకున్నారు. ఒక్క తడి ...

RAIN : ఇక రా.. వానా...!
A field ready for sowing in Yadiki

పొలాలన్నీ సాగుకు సిద్ధం

5న పునర్వసు కార్తె ఆరంభం

విత్తుకు అనుకూల సమయం

ఐదు రోజులపాటు జిల్లాలో వానలు

ఖరీఫ్‌ విత్తన సాగుకు మృగశిర కార్తె తరువాత పునర్వసు అనుకూలమని రైతులు విశ్వసిస్తారు. ఈ కార్తెలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటారు. ఈనెల 21తో మృగశిర కార్తె ముగిసింది. ఆలోగా పదును వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడ్డాయి. దీంతో 5,800 హెక్టార్లలో పంట సాగైంది. పునర్వసు కార్తె వచ్చే నెల 5న మొదలౌతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో దుక్కి దున్ని.. పొలాలను సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ, కంది తదితర విత్తనాలను సైతం తగినన్ని సమకూర్చుకున్నారు. ఒక్క తడి అయితేచాలు.. జిల్లాలో పంటల సాగు పూర్తిస్థాయిలో మొదలౌతుంది. ఆ ఒక్క వాన ఈ ఐదు రోజుల్లో కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శుక్రవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. రైతులకు ఇవన్నీ శుభవార్తలే..!


అనంతపురం అర్బన, జూన 28: ఖరీఫ్‌ సీజన ప్రారంభం కాగానే జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దుక్కి దున్నుకున్నారు. పంటల సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తరువాత కూడా వర్షాలు కొనసాగడంతో కొందరు వివిధ రకాల పంటలను సాగు చేశారు. మిగిలిన ప్రాంతాల రైతులు పదును వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది ముందుగానే, ఈ నెల 2న జిల్లాలో ప్రవేశించాయి. గత ఏడాది వర్షాభావం కారణంగా పంటల సాగు ఆశాజనకంగా సాగలేదు. జిల్లా వ్యాప్తంగా మరోమారు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆ సమస్య ఉండదని భావిస్తున్నారు.

పునర్వసు కోసం..

మృగశిర కార్తెలో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విత్తనం తక్కువ విస్తీర్ణంలోనే పడింది. ఈ నెల 7న మృగశిర కార్తె ఆరంభమై.. 21వ తేదీలో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 5,800 హెక్టార్లల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో ప్రధాన పంట వేరుశనగ మూడు వేల హెక్టార్లల్లో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి జిల్లా వ్యాప్తంగా 13వేల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 5 వేల హెక్టార్లకుపైగా వేరుశనగ ఉన్నింది. ఈ నెల 22 నుంచి ఆరుద్ర కార్తె ఆరంభమైంది. కానీ ఈ కార్తెలో విత్తనం వేస్తే దిగుబడి సరిగా రాదన్న అభిప్రాయం రైతుల్లో ఉంది. అందుకే పునర్వసు కార్తె కోసం వేచి చూస్తున్నారు. పునర్వసులో వర్షం కురవగానే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కువ శాతం రైతులు వేరుశనగ, కంది, పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వాటి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. జూలై 5న పునర్వసు కార్తె ఆరంభం కానుంది. ఈ ఏడాది పునర్వసులోనే ఎక్కువ శాతం పంటలు సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


బాగానే కురిసింది.. కానీ..

జూన నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 61.0 మి.మీ. కాగా, ఇప్పటి దాకా 145.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఈ సమయానికి 45.8 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లకంటే ఎక్కువ వాన కురిసింది. సాధారణ వర్షపాతం సైతం రెట్టింపునకు మించి కురిసింది. కానీ, విత్తనం వేసేందుకు అనువైన సమయంలో మాత్రం పెద్దగా కురవలేదు. ఈ కారణంగానే రైతులు పునర్వసు దాకా వేచి చూడాల్సి వస్తోంది. ఆకాశంలో మేఘాలకు కొదువ లేకపోయినా.. చినుకు రాల్చకుండా దోబూచులాడుతున్నాయి. ఈ ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినందున.. రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పదునైతే చాలు..

ఈ నెలలో కురిసిన వర్షాలకు పొలంలో సేద్యపు పనులు పూర్తి చేశాము. ఇక పదును వాన కోసం ఎదురుచూస్తున్నాం. వర్షం కురవగానే వేరుశనగ విత్తనం వేస్తాను. ఇప్పటికే విత్తన కాయలు కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నాను. కొన్ని రోజులుగా మేఘాలు ఊరిస్తున్నాయి. కానీ చినుకు రాలడంలేదు.

- పాండు, యాడికి

పత్తి సాగు చేశా..

వర్షం కురుస్తుందన్న నమ్మకంతో 12 ఎకరాల్లో ఐదు రోజుల క్రితం పత్తి పంట సాగు చేశాను. మేఘాలు ఊరిస్తున్నాయి తప్ప వర్షం కురవడం లేదు. ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాం. కొన్ని రోజులుగా గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఒక్క వాన పడితే పంట మొలకెత్తుతుంది.

- ఆదిరెడ్డి, వీరారెడ్డిపల్లి, యాడికి మండలం

వేరుశనగ పంట వేశా..

మృగశిర కార్తెలో ఐదెకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. గత నెలలో పడిన వర్షాలకు సేద్యం పనులు పూర్తి చేసుకున్నారు. అందుకే మృగశిర కార్తెలో వర్షం పడగానే విత్తనం వేశాను. మరో ఐదు ఎకరాల్లో కంది పంట సాగు చేయాలనుకుంటున్నాను. పదును వర్షం పడితే కంది విత్తనం వేస్తాను.

- వెంకటేష్‌, ఆత్మకూరు

మంచి వానలున్నాయి..

ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

- నారాయణస్వామి, సీనియర్‌ శాస్త్రవేత్త, వాతావరణ విభాగం, రేకులకుంట


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 11:45 PM