Share News

Come.. see our troubles! : రండి.. మా కష్టాలు చూడండి!

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:38 AM

కరువు పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. రబీ సీజనలో వర్షాభావం కారణంగా వివిధరకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 37,195 హెక్టార్లల్లో రూ.36.86 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా 34,303 హెక్టార్లల్లో పప్పుశనగ పంట దెబ్బతింది. దీని విలువ రూ.34.30 కోట్లు. ఇది కాకుండా మినుము, పెసర, ఉలవ, జొన్న, నువ్వులు, తెల్లకుసుమ, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ...

 Come.. see our troubles! : రండి.. మా కష్టాలు చూడండి!
Dry pulses in Yadiki Mandal due to lack of rain (File)

నేడు కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన

రబీ పంటనష్టం.. కరువు కష్టాల పరిశీలన

మాళాపురం.. గూళ్యపాలెం రైతులతో ముఖాముఖి

(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

కరువు పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. రబీ సీజనలో వర్షాభావం కారణంగా వివిధరకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 37,195 హెక్టార్లల్లో రూ.36.86 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా 34,303 హెక్టార్లల్లో పప్పుశనగ పంట దెబ్బతింది. దీని విలువ రూ.34.30 కోట్లు. ఇది కాకుండా మినుము, పెసర, ఉలవ, జొన్న, నువ్వులు, తెల్లకుసుమ, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నాయి. అనధికారికంగా నష్టం మరింత ఎక్కువగా ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు


చెబుతున్నాయి. విడపనకల్లు, యాడికి మండలాలలో పత్తి పంట నష్టం జరిగినా.. జాబితాలో చేర్చలేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గణాంకాలను కేంద్రం కోత పెట్టి సాయం అందిస్తుంది. పంటనష్టాన్ని సరిగా అంచనా వేయకుండా, అరకొర వివరాలతో కేంద్రానికి నివేదిక ఇస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది. అలాకాకుండా కొత్త ప్రభుత్వం చొరవచూపాలని రైతులు కోరుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

నేడు క్షేత్రస్థాయి పర్యటన

రబీ పంటనష్టం, పశుసంపద, తాగునీరు, కరువు కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఐఏఎస్‌ రితీష్‌ చౌహాన నేతృత్వంలో బృందం సిద్ధమైంది. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ రితీష్‌ చౌహాన, సభ్యులు పొన్నుస్వామి, సునీల్‌ దూబే గురువారం క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళతారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరుతారు. మొదట విడపనకల్లు మండలం మాళాపురం గ్రామానికి వెళ్లి కరువు ప్రభావిత పొలాలను పరిశీలిస్తారు. స్థానిక రైతులతో మాట్లాడి.. రబీ పంటనష్టం గురించి తెలుసుకుంటారు. వజ్రకరూరు మండలం గూళ్యపాల్యం గ్రామానికి 11.10 గంటలకు చేరుకుని, స్థానిక రైతులతో మాట్లాడుతారు.


గొర్రెలకు వదిలేశా..

రబీలో 2.78 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశాను. వర్షాభావంతో పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేదిలేక గొర్రెలకు వదిలేశాను. అప్పు చేసి రూ.25 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయాను. కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పంటనష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలి.

- లక్ష్మీనారాయణ, యాడికి

ఐదెకరాలకు క్వింటం వచ్చింది..

రబీలో ఐదెకరాల్లో పప్పుశనగ సాగు చేశాను. రూ.లక్ష దాకా పెట్టుడికి ఖర్చు చేశాను. వర్షాభావంతో పంట దెబ్బతింది. ఐదెకరాలకు ఒక క్వింటం దిగుబడి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకుంటే మాకు ఊరట కలుగుతుంది.

- బలరాం, విడపనకల్లు

పప్పుశనగ ఎండిపోయింది..

రబీలో 30 ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేలు చొప్పున రూ.6 లక్షల దాకా పెట్టుబడి ఖర్చు వచ్చింది. విత్తనం వేసిన తర్వాత వర్షాభావంతో పంట నిలువునా ఎండిపోయింది. ఎకరానికి కేవలం ఒక క్వింటం దిగుబడి వచ్చింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

- జగదీష్‌, ఎన.కొత్తపల్లి, యాడికి మండలం

క్వింటం కూడా రాలేదు

రబీలో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పప్పుశనగ సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేలు చొప్పున రూ.4 లక్షలదాకా ఖర్చు వచ్చింది. ఎకరానికి క్వింటం కూడా దిగుబడి రాలేదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. వానలు పడకపోవడంతో పూర్తిగా నష్టపోయాం.

- చిక ్కన్నయ్య, విడపనకల్లు


పత్తి వర్షార్పణం

నిలిచిన నీరు

కుళ్లిపోతున్న పత్తి పంట

చేతికొచ్చేసమయంలో విపత్తు

జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. వ్యవసాయ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా.. క్షేత్రస్థాయి నష్టాన్ని తెలుసుకునేందుకు రైతులతో గురువారం మాట్లాడనుంది. అప్పటి నష్టాన్ని చూపించేందుకు పొలాల్లో రబీ పంటలు లేవు. ఖరీఫ్‌ సాగుకు సేద్యాలు చేశారు. కొందరు ఇప్పటికే విత్తనం వేశారు. కానీ పత్తి పంట మాత్రం ఇప్పటికీ పొలాల్లోనే ఉంది. నష్టం జాబితాలో దీన్ని చూపించలేదు. నైరుతి వర్షాల కారణంగా పత్తి చేలల్లో నీరు నిలిచింది. పంట కుళ్లిపోతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి దృశ్యాలను కేంద్ర బృందానికి అధికారులు చూపించగలిగితే.. రైతులకు మేలు జరుగుతుంది.

బొమ్మనహాళ్‌, జూన 19: మండల వ్యాప్తంగా రబీ సీజనలో పత్తి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో దిగుబడిచేతికి అందకుండాపోయింది. పంట నీట మునిగి.. రైతులను నట్టేట ముంచింది. బోర్ల కింద సాగుచేసిన పత్తిపంట చేతికి వచ్చే సమయంలో వర్షపునీరు నిలబడి మొక్కలు నిలువునా కుళ్లిపోయాయి. బొమ్మనహాళ్‌ మండలంలోని శ్రీధరఘట్ట, ఉప్పరహాళ్‌, గౌనూరు, రంగాపురం క్యాంప్‌ తదితర గ్రామాలలో పత్తిపంట సాగుచేశారు. వరుసగా వర్షం కురుస్తుండడంతో పొలాల్లో నీరు నిలబడి మొక్కలు కుళ్లిపోయాయి. ఈదురు గాలులకు విరిగిపడి పత్తికాయలు రాలిపోయాయి. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని, పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల ప్రకారం పెట్టుబడి పెట్టామని, కనీసం ఎకరాకు 12 క్వింటాళ్లు అయినా దిగుబడి వస్తే బాగుండేదని రైతులు చెబుతున్నారు. సమీపంలో ఉన్న బళ్లారి మార్కెట్‌ వచ్చిన పత్తిని తీసుకెళ్తే చాలా అధ్వానంగా అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పది ఎకరాల్లో సాగుచేశా..

వ్యవసాయ బోర్ల కింద 10 ఎకరాల్లో పత్తిపంట సాగుచేశాను. పంట దిగుబడి బాగా వస్తే పిల్లలను బాగా చదివించాలనుకున్నా. రెండేళ్ల క్రితం కొడుకు చదువు మానేశాడు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలనైనా బాగా చదివించాలని ఆశపడ్డాను. 10 ఎకరాల్లో పత్తిపంట పెడితే ఎకరాకు నాలుగు క్వింటాలు కూడా రాలేని పరిస్థితి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ వర్షం వల్ల పత్తిపొలంలోకి భారీగా నీరు చేరి మొక్కలే కుళ్లిపోయి పత్తి నల్లగా మారిపోయింది. పెట్టుబడి సొమ్ము కూడా రాలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చుకోవాలో.. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలో దిక్కుతోచని పరిస్థితి.

- హనుమంతు, ఉప్పరహాళ్‌

ఐదెకరాల పంట పోయినట్లే..

ఐదెకరాల్లో వ్యవసాయ బోర్ల కింద పత్తిపంట సాగుచేశాను. వర్షం కురవడంతో పొలంలోకి నీరు భారీగా చేరింది. మొక్కలు విరిగిపడి కుళ్లిపోయి పత్తికాయలు నీళ్లలో కుళ్లిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి అందే పరిస్థితి లేదు. ఎకరాకు రూ. 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. రసాయనిక మందులు, ఎరువులకే అధికంగా ఖర్చు అయింది. ప్రస్తుతం ఎకరాకు మూడు క్వింటాలు కూడా రాలేని పరిస్థితి. మార్కెట్‌లో రూ.6000 నుంచి రూ. 6500 వరకు పలుకుతుందని దళారులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం 12 నుంచి 15 క్వింటాళ్లు పత్తిపంట దిగుబడి వస్తే రైతుకు గిట్టుబాటు ఉంటుంది.

- వెంకటేశులు, గౌనూరు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2024 | 12:38 AM