Share News

AMBIKA LAKSHMINARAYANA : డబుల్‌ ఇంజిన ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - May 09 , 2024 | 12:41 AM

డబుల్‌ ఇంజిన ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో బుధవారం మాట్లాడారు. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది..? అంబికా: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి...

AMBIKA LAKSHMINARAYANA : డబుల్‌ ఇంజిన ప్రభుత్వంతోనే అభివృద్ధి
Ambika Lakshminarayana

టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ

డబుల్‌ ఇంజిన ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో బుధవారం మాట్లాడారు.

ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది..?

అంబికా: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి రోజూ ప్రచారంలో పాల్గొంటున్నాను. ఏ నియోజకవర్గానికి వెళ్లినా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారి ఆదరణ చూస్తుంటే ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు నా గెలుపు నల్లేరుమీద నడకనే అనిపిస్తోంది.


మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది...?

అంబికా: 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. ప్రజా సేవకు గెలుపు ముఖ్యం కాదని భావించి రాజకీయాల్లో ఉంటూనే అంబికా ఫౌండేషనను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించాను. టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవ చేస్తూ, పార్టీ ఆదేశాల మేరకు కడప, ఆదోని తదితర నియోజకవర్గాల పరిశీలకుడిగా పనిచేశాను. పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. అందుకే నాకు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.

అంబికా ఫౌండేషన ద్వారా ఎలాంటి సేవలు అందిచారు?

అంబికా: గాంధీ జయంతిని పురస్కరించుకుని 2009 అక్టోబరు 2న అంబికా ఫౌండేషన ట్రస్ట్‌ను ప్రారంభించాము. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. బెంగుళూరు, పుట్టపర్తి, బత్తలపల్లి ఆర్డీటీ తదితర ఆస్పత్రులకు రెండు వేల మందికిపైగా రోగులను ఉచితంగా అంబులెన్సల్లో తరలించాము. బెంగళూరు ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రి సౌజన్యంతో అనేక వైద్య శిబిరాలు నిర్వహించాము. ఉచిత వైద్యసేవలు, ఔషధాలు అందించాము.


ఉచితంగా ఆపరేషన్లు చేయించాము. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశాం. గ్రామీణ యువతకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించాం. జాబ్‌ మేళాలు నిర్వహించి, 1650 మందికిపైగా నిరుద్యోగులకు బ్యాంకింగ్‌, పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాము. హిందూపురంలో ఏటా వేసవిలో ఉచితంగా తాగునీటి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ, బహుమతులను అందిస్తున్నాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాదిమందికి రక్తదానం చేయించాం.

మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు..?

అంబికా: ఎంపీగా నాకు ఒక్క అవకాశం ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తాను. యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. కరువు జిల్లాకు కేంద్ర నుంచి అత్యధికంగా నిధులు తెచ్చేందుకు చొరవ చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు చేరవేస్తాను. అనంతపురం నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తాం. అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయిస్తాం. కొత్త రైల్వే లైన్లు, అండర్‌ పాస్‌ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయిస్తాను. జిల్లాలో తాగు, సాగు నీరు వనరులను అభివృద్ధి చేయిస్తాను. అనంతపురంలోని డంపింగ్‌ యార్డును వేరే ప్రాంతానికి తరలించేలా చూస్తాం. సెంట్రల్‌ యూనివర్శిటీ పనులను పూర్తి చేయిస్తాం.

- అనంతపురం అర్బన

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 09 , 2024 | 12:41 AM