Share News

GOVT HOSPITAL : ఎప్పటికీ ఇంతేనా..?

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:47 PM

ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు పెద్ద దిక్కు.. అనంతపురం సర్వజన వైద్యశాల. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వ్యాధులు ప్రబలినా.. పరిగెత్తుకుంటూ పెద్దాసుపత్రికి వస్తారు. వీరిని అత్యవసరంగా పరీక్షించి.. తగిన వైద్యసేవలు అందించి.. ప్రాణాలు కాపాడటంలో కీలకంగా పనిచేసే విభాగం.. క్యాజువాలిటీ..! ఇలాంటి చోట తగినన్ని పడకలు, మౌలిక వసతులు కల్పించాలి. కానీ అలాంటివేవీ కనిపించవిక్కడ..! రోజుకు 300 నుంచి 400 మంది వరకూ రోగులు క్యాజువాలిటీకి వస్తారు. కానీ ఉన్న పడకలు 20 మాత్రమే..! అత్యవసర వైద్యం అందించి.. సంబంధిత విభాగాలకు పంపేందుకు కనీసం గంట పడుతుంది. ...

GOVT HOSPITAL : ఎప్పటికీ ఇంతేనా..?
On the 2nd of this month, two young men were treated on the bed with the dead body

క్యాజువాలిటీలో దయనీయ పరిస్థితులు

అత్యవసర రోగులకు పడకల కొరత

ఒక మంచంపై ఇద్దరు ముగ్గురికి వైద్యం

వీల్‌ చైర్లు, సె్ట్రచర్లు.. నేలపైనా చికిత్సలు

పెద్దాసుపత్రిని గాలికి వదిలేసిన పాలకులు

ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు పెద్ద దిక్కు.. అనంతపురం సర్వజన వైద్యశాల. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వ్యాధులు ప్రబలినా.. పరిగెత్తుకుంటూ పెద్దాసుపత్రికి వస్తారు. వీరిని అత్యవసరంగా పరీక్షించి.. తగిన వైద్యసేవలు అందించి.. ప్రాణాలు కాపాడటంలో కీలకంగా పనిచేసే విభాగం.. క్యాజువాలిటీ..! ఇలాంటి చోట తగినన్ని పడకలు, మౌలిక వసతులు కల్పించాలి. కానీ అలాంటివేవీ కనిపించవిక్కడ..! రోజుకు 300 నుంచి 400 మంది వరకూ రోగులు క్యాజువాలిటీకి వస్తారు. కానీ ఉన్న పడకలు 20 మాత్రమే..! అత్యవసర వైద్యం అందించి.. సంబంధిత విభాగాలకు పంపేందుకు కనీసం గంట పడుతుంది. ఒక్కోసారి ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం. అప్పటిదాకా ఆ 20 పడకల్లోనే అందరూ సర్దుకోవాలి. ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఇలా.. ఎంత


మంది పడితే అంతమంది..! చోటు లేకపోతే వీల్‌చైర్‌, సె్ట్రచర్‌, ఫ్లోర్‌.. ఇలా ఏదో ఒకచోట కూర్చునో.. కూలబడో చికిత్స చేయించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఇంత దుర్భర పరిస్థితి కొనసాగుతున్నా.. ఏ ఒక్కరికీ పట్టడం లేదు. కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు ఒక్క పది నిమిషాలు క్యాజువాలిటీ వద్ద నిలబడితే చాలు.. సమస్య తీవ్రత అర్థమౌతుంది. గత పాలకులు గాలికి వదిలేశారు. కొత్త ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాకు ప్రాతినిఽథ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కాస్త చొరవ చూపితే రోగులకు నరకం తప్పుతుంది.

- అనంతపురం టౌన

ప్రాణాలు నిలబెట్టే చోటు..

అత్యవసర వైద్య విభాగం అంటే.. పోయే ప్రాణాలను నిలపాల్సిన చోటు. అలాంటి చోట వైద్య సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. కానీ అనంత పెద్దాసుపత్రిలో ఆ పరిస్థితి లేదు. అసౌకర్యాల నడుమ వైద్యులు, సిబ్బంది కుస్తీ పట్టాల్సి వస్తోంది. తాజాగా అతిసార కేసులు వందల సంఖ్యలో వస్తున్నాయి. కానీ పడకలు లేవు. ఒక్కో పడకపై ముగ్గురు నలుగురికి సెలైన ఎక్కిస్తున్నారు. బాటిళ్లు అయిపోగానే ఇళ్లకు పంపుతున్నారు. పాముకాటు, తేలుకాటు బాధితులు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు క్యాజువాలిటీలో వైద్యం నరకప్రాయంగా మారుతోంది. వైద్యులు, సిబ్బంది నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. పేదలు పెద్దాసుపత్రికి వచ్చి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.


మాటలతో గడిపేశారు..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు మాటలతో కాలక్షేపం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన వసతులు కల్పిస్తామని అన్నారు. తగినంత మంది వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో అనంత పెద్దాసుపత్రి క్యాజువాలిటీని పునరుద్ధరించి, పడకలు పెంచుతామని అన్నారు. వారి హామీలు ఏ మేరకు నెరవేరాయో కళ్లారా కనిపిస్తున్నాయి.

వసతులు పెంచాలి

సర్వజన వైద్యశాల జిల్లాకు గుండెలాంటిది. మన జిల్లాతోపాటు ఇతరప్రాంతాల వారు కూడా ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారు. అందుకే అత్యవసర చికిత్సలు అందించే విభాగాలలో వసతులు, డాక్టర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మాటలతో కాలం గడిపేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అత్యవసర వైద్యసేవలు అందించే విభాగాలకు ఏమికావాలో తెలుసుకుని, ఆ మేరకు వసతులు కల్పించాలి. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

- రాంభూపాల్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

వెయ్యి పడకలకు పెంచాలి..

ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి సామర్థ్యం 560 పడకలు మాత్రమే. కానీ వెయ్యి నుంచి 1200 వందల వరకు అడ్మిషన పొంది చికిత్స చేయించుకుంటున్నారు. క్యాజువాలిటీకి కూడా రోజుకు 300 పైగానే అత్యవసర కేసులు వస్తున్నాయి. అక్కడ ఉన్న 20 పడకలు చాలడంలేదు. క్యాజువాలిటీని ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన విభాగంగా మార్చాం. అందులో మెడిసిన విభాగం హెచఓడీతోపాటు ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, నలుగురు అసిసెంట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు పీజీలు, ఎంబీబీఎస్‌ డాక్టర్లు ముగ్గురు ఉంటారు. వచ్చిన కేసులను పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందిస్తారు. ఏ కేసును ఏ వార్డుకు తరలించాలో కేస్‌ షీట్‌లో రాసి పంపిస్తారు. దీనివల్ల క్యాజువాలిటీలో కొంత సమస్య తీరనుంది. సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే ఆస్పత్రి సామర్థ్యాన్ని వెయ్యి పడకలకు పెంచాలి.

- డాక్టర్‌ హేమలత, డిప్యూటీ ఆర్‌ఎంఓ

మంత్రి సీరియ్‌సగా తీసుకోవాలి..

జిల్లా ఆస్పత్రిలో యుద్ధ ప్రాతిపదికన వసతులు పెంచాలి. వైద్య శాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన సత్యకుమార్‌ ఉన్నారు. ఆయన ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకోవాలి. అపుడే ఆస్పత్రిలో వసతులు పెరుగుతాయి. రోగులకు కష్టాలు తీరి సకాలంతో వైద్య సేవలు అందుతాయి.

- జాఫర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి

ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా..

జిల్లా ఆస్పత్రిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. సీఎం చంద్రబాబు, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అధికారులకు పరిస్థితిని తెలియజేస్తాం. ఎంపీతో కలిసి ఇప్పటికే ఆస్పత్రిని సందర్శించాను. కొన్ని వార్డులను పరిశీలించాము. సమస్యలపై నివేదిక తెప్పించుకున్నాము. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వానికి తెలియజేసి, అవసరమైన వసతుల ఏర్పాటుకు కృషిచేస్తాం.

- దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, అనంతపురం అర్బన ఎమ్మెల్యే


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 04 , 2024 | 11:47 PM