Share News

Payyavula Keshav : కొంగొత్త ఆశలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:40 PM

రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్‌ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్‌ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...

 Payyavula Keshav : కొంగొత్త ఆశలు
Payyavula Keshav

ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్‌

జిల్లాకు దక్కిన అరుదైన అవకాశం

అభివృద్ధికి దోహదం ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా..?

అనంతపురం, జూన 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్‌ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్‌ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో బటన నొక్కుడు తప్ప... ఏ ఒక్క అభివృద్ధికి బీజం పడలేదు.


పయ్యావుల కేశవ్‌కు ఆర్థికశాఖ దక్కడంతో జిల్లాలో అభివృద్ధికి బాటలు పడినట్లేనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. పడకేసిన, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పరుగులు తీయడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టుకు గంపెడు మట్టితీసిన పరిస్థితులు లేవు. ఒక ఇటుక రాయి వేసిన పాపానపోలేదు. ప్రధానంగా జిల్లాలో హంద్రీనీవా పూర్తి కాలేదు. హెచ్చెల్సీ ఆధునికీకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. భైరవాన తిప్ప, పేరూరు ప్రాజెక్టులకు కృష్ణాజలాలతో నింపాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన సందర్భంలోనూ అనేక హామీలు ఇచ్చారు. హంద్రీనీవాను పూర్తి చేసి డిస్ర్టిబ్యూటరీలు ఏర్పాటు చేసి, పంట పొలాలకు కృష్ణాజలాలు అందిస్తామన్నారు. పేరూరు, బైరవానతిప్ప ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రిజర్వాయర్లను నిర్మించి, తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు జిల్లాలోని


పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం అందరికీ ఎరుకే. చంద్రబాబు మంత్రివర్గంలో కీలకం ఆర్థిక శాఖ. ఆ శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తిచేసి కరువు జిల్లా రైతాంగం, ప్రజానీకానికి సాగు, తాగునీరు అందిస్తారనే ఆశల్లో జిల్లా ప్రజానీకం ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన పరిశ్రమల కోసం నిధుల మంజూరులో పయ్యావుల కేశవ్‌ కీలకంగా వ్యవహరించే పరిస్థితులు లేకపోలేదు. ఏదేమైనా జిల్లా అభివృద్ధికి మంచి రోజులు రానున్నాయనే అభిప్రాయం అన్నివర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం. పయ్యావుల కేశవ్‌కు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడంతో కూటమి నేతలతోపాటు ఆయాపార్టీల శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 14 , 2024 | 11:40 PM