Share News

PENSIONS : ఏమైనా పద్ధతా..?

ABN , Publish Date - May 01 , 2024 | 12:42 AM

పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...

PENSIONS : ఏమైనా పద్ధతా..?
Beneficiaries Awaiting Pension (File)

పింఛన్లు బ్యాంకులో వేయడం సరికాదు

వృద్ధులు, దివ్యాంగులకు విత డ్రా ఇబ్బందికరం

బ్యాంకుల్లో గంటలకొద్దీ క్యూలో ఉండాల్సిందే..

ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చే వీలున్నా.. నాటకం

వైసీపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు

పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో 5,976 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ పింఛన్ల పంపిణీ చేపడితే.. సగటున ఒక్కో ఉద్యోగికి 54 మంది లబ్ధిదారులు మాత్రమే వస్తారు. వలంటీర్లకు యాభై కుటుంబాల బాధ్యతను మాత్రమే అప్పగించారు. ఈ లెక్కన వలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగులు పింఛన్లను సులువుగా పంపిణీ చేయవచ్చు. గత నెలతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య ఈ నెల 797 తగ్గింది. ఇందుకు వివిధ కారణాలు చెబుతున్నా, ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

- అనంతపురం క్లాక్‌టవర్‌/ఉరవకొండ


85 వేల మందికి...

జిల్లాలోని 2,88,334 మంది పింఛనదారులకు మే నెలకు రూ.86.33 కోట్లు మంజూరు చేశారు. లబ్ధిదారులలో 85,618 మందికి మాత్రమే ఇళ్ల వద్ద పింఛన పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలినవారికి రూ.60.81 కోట్లు ఆధార్‌ అనుసంధానమై, ఎనపీసీఐ ద్వారా నిర్ధారించిన బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాని పింఛనదారులకు, ప్రత్యేక కేటగిరి విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దనే పింఛన పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌ పింఛన్ల పంపిణీ గందరగోళంగా సాగింది. వృద్ధులు, విభిన్నప్రతిభావంతులు నానా అవస్థలు పడ్డారు.

వైసీపీ అక్కసు

సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని.. పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వలంటీర్లను తొలగించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. వలంటీర్లను విధులకు దూరం చేయడాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. దీనిని రాజకీయం చేస్తూ, ఫించన్ల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని గత నెలలో అధికార పార్టీవారు ప్రచారం చేశారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ.. కొత్తనాటకానికి తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి.


ప్రత్యామ్నాయం చూడమంటే..

పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సూచించింది. కానీ వైసీపీ తన కుటిలబుద్ధిని ప్రదర్శించింది. గత నెలలో మండుటెండల్లో ఫించన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల వద్దకు వెళ్లేలా చేసింది. తాజాగా బ్యాంకుల్లో ఫించన సొమ్ము జమ చేస్తామని చెప్పి.. మరో రకంగా ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చూస్తోంది. ఉరవకొండ మండలంలో మొత్తం 10,951 మంది లబ్ధిదారులు ఉన్నారు. నింబగల్లు, ఆమిద్యాల, రాకెట్లలో మాత్రమే బ్యాంకులు ఉన్నాయి. కౌకుంట్ల పంచాయతీలో 980మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఫించన బ్యాంకులో జమచేస్తే.. నగదు తీసుకునేందుకు 10 కి.మీ. దూరంలో ఉన్న రాకెట్ల బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫించన కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఆ రోజు ఇవ్వకపోతే మరుసటి రోజు వెళ్లాలి. ఇలా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే.. వచ్చిన పింఛన సొమ్ము ఆటో చార్జీలకే సరిపోతుందని బాధితులు వాపోతున్నారు.

అధికారుల నిర్ణయం తప్పు..

ఫించనను బ్యాంకు ఖాతాల్లో జమచేయడం మాలాంటి వృద్ధులకు ఇబ్బంది కలిగిస్తుంది. పింఛన సొమ్ము తెచ్చుకునేందుకు పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడేందుకు శక్తి ఉండదు. అధికారులు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఇంటి వద్దే పింఛన ఇవ్వాలి.

- ఓబులమ్మ, దివ్యాంగురాలు, ఉరవకొండ


మా ఊరిలో బ్యాంకులు లేవు..

మా ఊరిలో బ్యాంకులు లేవు. కిందటి నెల సచివాలయం వద్దకు వెళ్లి పింఛన తీసుకున్నాను. బ్యాంకులో జమ చేస్తే 10 కి.మీ. వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల ఇళ్ల వద్ద ఫించన ఇస్తే బాగుండేది.

- నాగమ్మ, మైలారంపల్లి

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 01 , 2024 | 12:42 AM