Share News

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:10 AM

ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి
JCPR is inquiring about the details with the doctor

తాడిపత్రి, నవంబరు19(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం రూ.24కోట్లతో భవనం కట్టి వాటికి మౌలిక సదుపాయాలు లేక అసంపూర్ణంగా మిగిలిపోవడంతో డాక్టర్లు, రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లగా ఆసుపత్రిని బాగుచేయాలంటే ప్రస్తుతం నిధులు లేకపోయినా సొంత నిధులతో ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వాటి ఖర్చు భారీగా అవుతుందని అంచనా వేశారు. మున్సిపల్‌ చైర్మన తన సొంత ఖర్చులు రూ.50లక్షలు ప్రకటించారు. ఈ డబ్బులను కాంట్రాక్టర్‌ విడతలవారీగా తీసుకొని వాటికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. జనవరికల్లా పూర్తిగా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక్కడి నుంచి అనంతపురానికి వెళ్లకుండా ప్రతి కేసును చూడాలన్నారు.

ఇళ్ల నిర్మాణాలు చేపట్టండి: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం హౌసింగ్‌ అధికారులు, టిడ్కో ఇళ్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని వాటికి కారణాలు తెలపాలన్నారు. ఇళ్లు మంజూరై ఎక్కువరోజులు కట్టుకోకుంటే కొంత టైం ఇచ్చి వాటిని పూర్తి చేసే విధంగా చూడాలని, లేనిపక్షంలో వాటిని పరిశీలించి రద్దుచేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. పేదల ఇళ్లను ఆక్రమించి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలిస్తామన్నారు. డీడీలు కట్టి ఇళ్లు రాని వారుంటే మున్సిపాలిటీలోని చైర్మన చాంబర్‌లో అర్జీలు ఇవ్వవచ్చు అన్నారు. కడపరోడ్డులో 405 మంది బీడీకార్మికులకు ఇచ్చిన స్థలాలల్లో ఇళ్లను కట్టించేందుకు హౌసింగ్‌ అధికారులు పరిశీలించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ, తహసీల్దార్‌ రజాక్‌వలి, టిడ్కో ఈఈ సుధారాణి, డీఈ షబానా, హౌసింగ్‌ డీఈ షెక్షావలి, ఏఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:10 AM