Share News

Pinchan : నేడే పింఛన్ల పండుగ

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:13 PM

సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పింఛన సొమ్ము పెంపు హామీ సోమవారం నెరవేరనుంది. పెంచిన పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి ముంగిటకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల సొమ్ముతోపాటు ఏప్రిల్‌, మే, జూన మాసాలకు సంబంధించి రూ.1000 చొప్పున కలిపి మొత్తం రూ.ఏడు వేలు అవ్వాతాతలకు ఇవ్వనున్నారు. పెంచిన పింఛన్ల ...

Pinchan : నేడే పింఛన్ల పండుగ
DRDA PD and employees releasing CM's letter to NTR Bharosa pension beneficiaries

ఎన్టీఆర్‌ భరోసా పింఛన పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

అనంతపురం, జూన 30 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పింఛన సొమ్ము పెంపు హామీ సోమవారం నెరవేరనుంది. పెంచిన పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి ముంగిటకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల సొమ్ముతోపాటు ఏప్రిల్‌, మే, జూన మాసాలకు సంబంధించి రూ.1000 చొప్పున కలిపి మొత్తం రూ.ఏడు వేలు అవ్వాతాతలకు ఇవ్వనున్నారు. పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మంత్రులు, ఎంపీలు,


ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ఆయా పార్టీల శ్రేణులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ చిత్రపటాలకు పాలాభిషేకం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలోని మంత్రులు, ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కానున్నారు.

2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు

జిల్లాలో 289508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్ల పింఛన పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో పంపిణీకి సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. వృద్ధాప్య పింఛన లబ్ధిదారులు 144396 మంది ఉండగా వారికి పెంచిన పింఛన సొమ్ముతో రూ.101.077 కోట్లు చెల్లించనున్నారు. 66749 మంది వితంతువులకు రూ.46.72 కోట్లు, 6759 మంది చేనేత కార్మికులకు రూ.4.73 కోట్లు, 354 మంది కల్లుగీత కార్మికులకు రూ.24 లక్షలు, 890 మంది మత్స్యకారులకు రూ.62 లక్షలు, 6737 మంది ఒంటరి


మహిళలకు రూ.4.71 కోట్లు, 3525 మంది చర్మకారులకు రూ.2.46 కోట్లు, 207 మంది హిజ్రాలకు రూ.14 లక్షలు, 2476 మంది హె చఐవీ బాధితులకు రూ.1.73 కోట్లు, 3137 మంది డప్పుకళాకారులకు రూ.2.19 కోట్లు, 185 మంది కళాకారులకు రూ.13 లక్షలు చెల్లించనున్నారు. దివ్యాంగులకు రూ.3వేలుగా ఉన్న పింఛనను రూ.6వేలకు పెంచారు. ఈ నేపథ్యంలో 46351 మంది దివ్యాంగులకు రూ.27.81 కోట్లు, 391 మంది కృష్ఠు బాధితులకు రూ.23 లక్షలు చెల్లించనున్నారు. నడవలేని స్థితిలో ఉన్న పూర్తి స్థాయి దివ్యాంగుల పింఛనను రూ.5వేల నుంచి రూ.15వేలకు పెంచారు. ఈ క్రమంలో జిల్లాలోని 1444 మంది లబ్ధిదారులకు రూ.2.16 కోట్లు, 1091 మంది ప్రమాద బాధితులకు రూ.1.63 కోట్లు చెల్లించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛనను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచారు. ఆ మేరకు జిల్లాలోని 19 మందికి రూ.1.9 లక్షలు, 83 మంది కిడ్నీ, లివర్‌, గుండె మార్పిడి బాధితులకు రూ.8.3 లక్షలు, 22 మంది సీకేడీ సంబంధిత బాధితులకు రూ.2.2 లక్షలు, 281 మంది డయాలసిస్‌ బాధితులకు రూ.28.10 లక్షలు, 10 మంది సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తులకు రూ.లక్ష, 125 మంది థలసీమియా బాధితులకు రూ.12.5 లక్షలు, 49 మంది హిమోఫీలియా బాధితులకు రూ.4.9 లక్షలు, ఆరుగురు సైనిక్‌ వెల్ఫేర్‌లకు రూ.5వేలు చొప్పున రూ.30వేలు, 4221 మంది అభయ హస్తం లబ్ధిదారులకు రూ.500 చొప్పున రూ.21.10 లక్షలు అందజేయనున్నారు. మొత్తం మీద 289508 మంది వివిధ రకాల పింఛనదారులకు రూ.197.44 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామి మేరకు... పెంచిన పింఛన రూ.4వేలతోపాటు బకాయి రూ.3వేలు కలిపి రూ.7వేలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అదనంగా రూ.70.62 కోట్లు లబ్ధిదారులకు అందనుంది.


పింఛన్ల పండుగలో పాల్గొనండి

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌

అనంతపురం అర్బన: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగే పింఛన్ల పండుగ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛనను రూ.4వేలకు పెంచారన్నారు. బకాయిలతో కలిపి సోమవారం ఒక్కో పింఛనదారుడికి రూ.ఏడువేలు అందజేస్తారన్నారు.

ఇంటి వద్దే పింఛన : డీఆర్‌డీఏ పీడీ

అనంతపురం క్లాక్‌టవర్‌: ఇంటివద్దనే ఎన్టీఆర్‌ భరోసా పింఛన అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన లబ్ధిదారులకు రాసిన లేఖను ఆదివారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో పీడీ ఈశ్వరయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈనెల ఒకటోతేదీన ఇంటివద్దనే లబ్ధిదారులకు పింఛన అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12వేల క్లస్టర్లలో మ్యాపింగ్‌ ఆధారంగా ఒక్కరోజులోనే పింఛన పంపిణీ పూర్తి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

సర్వం సిద్ధం

2,89,508మందికి రూ. 197.44 కోట్ల పింఛన

ఒక్కరోజే వందశాతం పంపిణీకి ఏర్పాట్లు

కలెక్టరు వినోద్‌కుమార్‌

అనంతపురం టౌన, జూన 30: ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీకి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. పింఛన్ల పంపిణీపై ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు. జిల్లాలో ఈనెల నుంచి 11రకాల పింఛన్లకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు మూడునెలల అరియర్స్‌తో కలిపి నగదు అందజేస్తామన్నారు. జిల్లాలో 11 రకాల పింఛన్లకు సంబంధించి 2,89,508మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరిలో గతంలో రూ.3వేలు తీసుకుంటున్న వారికి రూ4వేలు, పూర్తిగా దివ్యాంగులకు రూ.5వేల నుంచి 15వేలకు పెంచిన సొమ్మును సోమవారం పంపిణీ చేస్తారన్నారు. ఉదయం 6గంటలనుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. లబ్ధిదారుల


ఇళ్లవద్దకే వెళ్లి పింఛన అందజేస్తారన్నారు. లబ్ధిదారులు వారి చిరునామాలో ఉదయం 6గంటల నుంచే అందుబాటులో ఉండాలని కలెక్టరు కోరారు. సోమవారం ఒక్కరోజే వందశాతం పింఛన్ల పంపిణీ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2,89,508 లబ్ధిదారులకు రూ.197.44కోట్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి 50ఇళ్లకు గ్రామ, మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను క్టస్టర్‌ మ్యాపింగ్‌ చేసినట్లు వెల్లడించారు. పింఛన డబ్బులు తీసుకున్న లబ్ధిదారులు అక్నాలెడ్జ్‌మెంట్‌పై సంతకం లేదా వేలిముద్రలు వేయాల్సి ఉంటుందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 30 , 2024 | 11:13 PM