Share News

AP Govt: ఇసుక కాంట్రాక్టులు రద్దు?

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:24 AM

ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ హయాంలో.....

AP Govt: ఇసుక కాంట్రాక్టులు రద్దు?

  • ప్రాథమికంగా నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు

  • తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు

  • ఉచిత ఇసుక అమలుకు కొనసాగుతున్న ఏర్పాట్లు

  • ఆ జిల్లాల్లో 8 నుంచి ఆన్‌లైన్‌ పర్మిట్లు

  • స్టాక్‌ పాయింట్లలో నిల్వలను గుర్తిస్తున్న గనులశాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ హయాంలో ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ సంస్థలకు 2023 డిసెంబరులో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు చేపట్టేలా రూ.1,530 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించినా, హెచ్చరికలు జారీ చేసినా ఆ రెండు కంపెనీలు పెడచెవినపెట్టాయి. పర్యావరణ, పీసీబీ అనుమతులు లేకుండా భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుకను తవ్వేస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితశాఖ శాస్త్రవేత్తల బృందం అటు ఎన్జీటీకి, ఇటు సుప్రీంకోర్టుకు రెండు దఫాలుగా నివేదికలు ఇచ్చాయి.

దీంతో ఆ రెండు కంపెనీల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నదీ ప్రవాహాల దశ, దిశలు మారిపోయాయి. ఒప్పందాలను ఉల్లంఘించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు రెండేళ్ల ఇసుక కాంట్రాక్టును రద్దుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్టాక్‌ పాయింట్లలో ఎంత మేరకు ఇసుక ఉందో గుర్తించేపనిలో గనులశాఖ నిమగ్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ లెక్క తేలనుంది. ఆ వెంటనే ఇసుక కాంట్రాక్టును ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ రెండు కంపెనీలకు ఏపీఎండీసీ ద్వారా నోటీసులు ఇప్పించాలనుకుంటోంది. అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా ఒప్పందం, కాంట్రాక్టు రద్దుచేసుకునే వెసులుబాటు ఉంది.


ఈ రెండింటినీ జగన్‌ సర్కారు రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు ఈ రహస్య ఒప్పందాలనే తెరమీదకు తీసుకొచ్చి ఆ రెండు కంపెనీల కాంట్రాక్టుపై వేటువేయబోతున్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ ఏపీఎండీసీ నుంచి ఆ రెండు కంపెనీలకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాని అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, గనుల శాఖ డీడీలతో సంయుక్తంగా ఓ సంయుక్త ఖాతాను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అలాగే, ప్రత్యేకంగా మరో ఇసుక ఖాతాను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని గనుల శాఖ అధికారులు కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం అంటే.. ఒక టన్ను ఇసుకపై ప్రభుత్వానికి వచ్చే ఫీజు రూ.275ను మినహాయిస్తారు. ఇక స్థానిక సంస్థలకు ఇచ్చే రూ.88 వాటికి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీనరేజీ కాంట్రాక్టు లేని ఏడు జిల్లాల్లో ఖనిజాల రవాణాకు ఆన్‌లైన్‌ పర్మిట్లు ఇవ్వాలని గనుల శాఖ నిర్ణయించింది. కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ, కర్నూలు, నెల్లూరుజిల్లాల్లో సోమవారం నుంచి ఖనిజాల రవాణాకు ఆన్‌లైన్‌ పర్మిట్లు ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతి జిల్లా నుంచి సగటున నెలకు రూ.5కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

సీనరేజీ కాంట్రాక్టు కూడా రద్దు?

ఖనిజాల తవ్వకాలు, రవాణా సందర్భంగా లీజుదారుల నుంచి సీనరేజీ వసూలు బాధ్యతను జగన్‌ సర్కారు అస్మదీయ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టింది. ఆ కంపెనీలు గత ఆరు నెలలుగా సీనరేజీ కింద వసూలు చేసిన సొమ్మును సర్కారుకు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సీనరేజీ కాంట్రాక్టును కూడా రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 05 , 2024 | 03:27 AM