Share News

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

ABN , Publish Date - Aug 01 , 2024 | 09:25 AM

తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు
Madanapalle Incident

అమరావతి/అన్నమయ్య జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసు దర్యాప్తును (Madanapalle Incident) సీఐడీకి (AP CID) అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్నిప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు.. అగ్నిప్రమాదం కేసులో నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో సమన్వయం కోసం సీఐడీ దర్యాప్తు ఇవ్వడం మేలని ప్రభుత్వం భావించింది. మరీ ముఖ్యంగా.. ఈ కేసులో భూ సంబంధిత బాధితులందరికీ న్యాయం చేయాలని.. ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


ఇప్పుడిప్పుడే..!

ఇదే సమీక్షలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. బాధితులు అంత మంది ఉంటారని, సాక్ష్యాధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారనే విషయాన్ని అస్సలు ఊహించలేదని.. తాను ఇచ్చిన ఒకే ఒక్క సందేశానికి అనూహ్య స్పందన వచ్చిందని చంద్రబాబుకు నిశితంగా వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ మొత్తం ఘటనలో గత ప్రభుత్వంలో వ్యవహరించిన కొందరు పెద్దలు ప్రమేయానికి సంబంధించిన అంశాలన్నీ ముడిపడి ఉన్నాయని ఇప్పుడిప్పుడే తేలుతోంది. అందుకే ఇక ఈ కేసును సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి చూస్తే.. ఈ కేసు అతి త్వరలోనే తేలిపోనుందని మాత్రం చెప్పుకోవచ్చు.


ఎవరా 8 మంది..!

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు అనుసంధానంగా మరో ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది కేసులు ఏమిటి..? ఎవరి మీద నమోదు చేశారు..? అన్న ప్రశ్నలు మదనపల్లె ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 21వ తేదీ రాత్రి మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం విదితమే. దీనిపై సీఐడీ సహకారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.


అదే జరిగితే..?

ఈ క్రమంలో డీఐజీ ప్రవీణ్‌ మదనపల్లెలో ఇచ్చిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో ఉండకూడని పత్రాలు దొరికినట్లు, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో పాటు 52 మందిని విచారించగా, అందులో 15 మంది అనుమానితులను విచారించి సోదాలు చేశామన్నారు. వారి వద్ద ఉండకూడని కీలకపత్రాలు స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమెదు చేశామన్నారు. వాస్తవంగా ఏదైనా నేరం జరిగితే ఆ నేరం చేసిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన, సాక్ష్యాలు, ఆధారాలు చెరిపేందుకు, దాచిపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసు కాస్పరసి సెక్షన్‌ 120-బి (కూడగట్టుకుని నేరం చేసిన) కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైళ్ల దహనంపై మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 135/2024 కింద నమోదైన కేసుకు, ఈ ఎనిమిది కేసులు కూడా తోడవుతాయనే కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే 15 మంది అనుమానితుల్లో ఎవరిపై ఎనిమిది కేసులు నమోదు చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మదనపల్లె ఘటనలో కీలక పరిణామం..

Updated Date - Aug 01 , 2024 | 10:14 AM