AP News : ఆదిమూలంపై అత్యాచారం కేసు
ABN , Publish Date - Sep 07 , 2024 | 05:08 AM
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
బాధిత మహిళ ఫిర్యాదుతో తిరుపతి పోలీసుల కేసు నమోదు
వైద్య పరీక్షలకు బాధితురాలి నిరాకరణ
చెన్నైలోని ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోనేటి
విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు
తిరుపతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆదిమూలం తనను బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారంటూ తెలుగు మహిళా నాయకురాలు గురువారం రాత్రి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్ నంబరు 430/24తో ఐపీసీ 376, 506(భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64, 351-2) కింద కేసు నమోదు చేశారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలానికి చెందిన బాధితురాలు గురువారం హైదరాబాద్‌లో మీడియా ఎదుట ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని టీడీపీ నుంచీ సస్పెండ్ చేశారు. ఆ క్రమంలో గురువారం రాత్రి బాధితురాలు తన భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 6, 17న తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిచి బలవంతంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ ఎమ్మెల్యే ఫోన్లు చేస్తుండడంతో తన భర్త తనను నిలదీశారని, దీంతో భర్తకు జరిగిన విషయం చెప్పినట్టు తెలిపారు.
ఆగస్టు 10వ తేదీన అదే హోటల్‌కు రమ్మని ఎమ్మెల్యే ఫోన్ చేయడంతో.. తన భర్త సూచనల మేరకు పెన్ కెమెరాలో తనను బలాత్కరించడాన్ని వీడియో రికార్డు చేశానని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో సీఐ మహేశ్వర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షలు అవసరం లేదంటూ మొండికేయడంతో పోలీసు అధికారులు, వైద్యులు ఆమె నుంచీ లిఖితపూర్వకంగా రాయించుకుని వెనక్కి పంపేశారు.
కాల్ డేటా సేకరణ
ఎమ్మెల్యే ఆదిమూలం గుండెపోటుతో చెన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. తెలుగు మహిళ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారో తెలుసుకునేందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. మరోవైపు.. ఆదిమూలం వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో బాధిత మహిళ నుంచి ఫిర్యాదు అందగానే తిరుపతి జిల్లా పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్మెల్యే మొబైల్ నంబరు, బాధిత మహిళకు చెందిన రెండు నంబర్లు, ఆమె భర్త మొబైల్ నంబర్ల కాల్ డేటా సేకరిస్తున్నారు. బాధిత మహిళ హోటల్‌కు వెళ్లిన తేదీలతో పాటు ఆయా తేదీలకు పది రోజులు అటూ ఇటూగా కూడా కాల్ డేటా సేకరిస్తున్నారు. ప్రఽధానంగా ఫోన్లు ఎవరు ఎవరికి చేశారు? ఎన్ని సార్లు చేశారు? అన్న వివరాలపై దృష్టి సారించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను నిర్ధారించుకోవడంతో పాటు ఫిర్యాదు వెనుక కుట్ర జరిగిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం.
అధికార పార్టీ మహిళా నేత ఫిర్యాదు కావడంతో కేసును అత్యంత ప్రాధాన్యంగా భావించి ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, క్రైమ్ విభాగాలతో కూడా సమన్వయం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే, బాధిత మహిళ గది నుంచి రిసెప్షన్ వద్దకు రెండు సార్లు వచ్చి వెళ్లిన దృశ్యాలు హోటల్ సీసీ టీవీ కెమెరాలో రికార్డయినట్టు తెలిసింది. ఆ దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని సమాచారం. దీంతో సంబంధిత హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిసింది.