Share News

భూదందాలు బయటికొస్తాయనే ఫైళ్ల దహనం

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:09 AM

మదనపల్లెలో భూరికార్డుల దహనం ఘటనపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రె

భూదందాలు బయటికొస్తాయనే ఫైళ్ల దహనం

  • సీఐడీ సమగ్ర దర్యాప్తు చేస్తుంది

  • దోషులందరినీ గుర్తిస్తాం... అరెస్టు చేస్తాం: మంత్రి అనగాని

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మదనపల్లెలో భూరికార్డుల దహనం ఘటనపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడారు. ‘జగన్‌ ప్రభుత్వంలో అనేక భూదందాలకు పాల్పడ్డారు. అవి బయటకు వస్తాయని ఫైళ్లు దహనం కుట్ర పన్నారు. మదనపల్ల్లె ఆర్డీవో కార్యాలయంలో అనేక రెవెన్యూ రికార్డులు కుట్రలో భాగంగానే తగలబెట్టారు. సీసీటీవీలు పని చేయలేదు. పలు రసాయనాలను వాడారని నిర్ధారణ జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. ఫైళ్లు తగలబెట్టిన వారంతా మాజీ మంత్రి అనుచరులని గుర్తించారు. భూ దందాలు, ఫైళ్ల దహనంపై సీఐడీ విచారణ జరుగుతోంది. ఫైళ్లను బూడిద చేసినా అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వెలికి తీశాం. ఆన్‌లైన్‌లో ఉన్న అన్ని ఫైళ్లను రిట్రీవ్‌ చేశాం. సమగ్ర దర్యాప్తు చేసి దోషులందరినీ గుర్తిస్తాం. వారందరినీ అరెస్టు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

  • వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన

భూ దందాల అంశంపై మండలిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని చేసిన వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి చేతనైతే భూదందాల్లో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, దర్యాప్తు జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే అభ్యంతరం లేదన్నారు. మదనపల్లె అగ్నిప్రమాదం తర్వాత భూకబ్జాలపై అర్జీలు స్వీకరించామని, వాటిల్లో పెద్దిరెడ్డి ఎక్కువ కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని అనగాని వివరించారు. పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ‘రామచంద్రారెడ్డి పేరును రికార్డుల నుంచి తొలగించాలి. విచారణ జరుగుతున్నప్పుడు పేర్లుఎలా చెబుతారు? విచారణలో తేలాక మాట్లాడాలి. ప్రతి ఒక్కరిపై బురద చల్లడమేంటి?’ అని ప్రశ్నించారు. చైర్మన్‌ మోషేన్‌ రాజు మాట్లాడుతూ, పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలని సభ్యులకు సూచించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:09 AM