Share News

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:49 AM

‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

  • రెండేళ్లు వర్షాల్లేకున్నా ఇబ్బంది రాకూడదు

  • నదుల అనుసంధానంతోనే పరిష్కారం

  • ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన వైసీపీ

  • జలాశయాల మరమ్మతులకు

  • రూ.300 కోట్లు అవసరం

  • సోమశిల ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

  • రెండేళ్లు వర్షాల్లేకున్నా ఇబ్బంది రాకూడదు

  • నదుల అనుసంధానంతోనే సమస్యకు చెక్‌

  • సోమశిల సందర్శనలో సీఎం చంద్రబాబు

నెల్లూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి.

అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరగాలి. ఇది జరిగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూడవచ్చు. పోలవరం పూర్తయితేనే ఇది సాధ్యపడుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న ఏప్రాన్‌ పనులను పరిశీలించి, మరమ్మతులకు గురైన గేట్లను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిలకు అత్యవసరంగా చేయాల్సిన మరమ్మతుల పనులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమశిల గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు.


  • ఐదు చోట్ల ఫైళ్లు తగలబెట్టారు..

కరుడుగట్టిన నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రతిరోజూ గుడ్డ కాల్చి మీద వేసి తుడుచుకోండి అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసైన్డ్‌ భూములను దోచేసి అధికారం మారగానే మదనపల్లిలో ఫైళ్లు కాల్చేశారని దుయ్యబట్టారు. ఇప్పటివరకూ ఐదు చోట్ల ఫైళ్లు తగలబెట్టారని అన్నారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదని, ఎక్కడ దాక్కున్నా శిక్షిస్తామని హెచ్చరించారు.


  • ఉచిత ఇసుక అమలుకు బాధ్యత

ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమలు జరగాలని, అందుకు ఎన్డీయే కూటమి నేతలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే రైతులకు రూ.20వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. 2021లో వరదలకు సోమశిల ఏప్రాన్‌ దెబ్బతిని ప్రాజెక్టు మనుగడ ప్రమాదంలో పడితే కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు రూ.300 కోట్లు అవసరమని ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు.

ఇందులో ఒక్క సోమశిలకే రూ.140 కోట్లు అవసరం. వర్షాకాలంలోపు సోమశిల ఏప్రాన్‌ పనులు పూర్తి చేసి ప్రాజెక్టుకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పీ నారాయణ, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


  • ఆ యాడ్స్‌ సొమ్ములో సగమిచ్చినా..!

పులిచింతల గేటు కొట్టుకుపోయినప్పుడే నాటి సీఎం జగన్‌ బయటకు వచ్చి ఉంటే ఆ తర్వాత గుండ్లకమ్మ గేటు, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేవి కావు. జగన్‌ పత్రికకు రూ.403 కోట్లు ప్రకటనల రూపంలో కట్టబెట్టారు. అందులో రూ.200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు ఈ దుస్థితిలో ఉండేవి కావు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన వెంటనే స్పందించి మంత్రులతోపాటు ఇంజనీర్‌ కన్నమనాయుడును పంపాం. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని మూడు రోజుల్లోనే తుంగభద్ర స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేశాం. ఇదీ మా ప్రభుత్వ పనితీరు.

- చంద్రబాబు


  • అడ్మినిస్ట్రేషన్‌ నిద్రపోతోంది: సీఎం

సమాచార పౌర సంబంధాల శాఖ నెల్లూరు డీడీ సదారావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభంలో మైక్‌ పనిచేయకపోవడంతో సీరియస్‌ అయ్యారు. ‘ఏం చేస్తున్నారు? బీ క్లియర్‌.. అడ్మినిస్ట్రేషన్‌ ఇంకా నిద్రపోతోంది. నేను 95 సీఎం అని చెప్పినా ఇంకా మీకు అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు యాక్షన్‌లోకి వస్తున్నా.

బీకేర్‌ ఫుల్‌. నువ్వేమి ప్రేక్షకుడివి కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్‌వైజ్‌ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్‌ మొత్తం భ్రష్టుపట్టింది. మీరంతా ఇష్టారాజ్యం అనుకుంటున్నారు. మంచిది కాదిది. బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఆ బాధ్యత అధికారులందరిపై ఉంది. గుర్తు పెట్టుకోండి’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Updated Date - Aug 20 , 2024 | 03:49 AM