Tirumala: మహారథంపై మహామూర్తి
ABN , Publish Date - Oct 12 , 2024 | 01:52 AM
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
నేటి చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పూర్తి
తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన రథోత్సవం.. 9.35 గంటల వరకు సాగింది. ఇక, రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహనంపై మలయప్పస్వామి కల్కి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరిదైన ఈ వాహన సేవకు భక్తులు తరలిరావడంతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. శనివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తవుతాయి.
తిరుమలలో చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం జరగనున్న చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, ఆ తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. దీనికోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు ఎస్ఫీఎఫ్ సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చక్రస్నానం పవిత్రత రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాలని టీటీడీ కోరింది. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక, శ్రీవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించే వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో 1,200 కిలోల పుష్పాలు, 10 వేల కట్‌ఫ్లవర్స్‌తో అలంకరణలు చేపట్టారు.
తుది ఘట్టాన్నీ విజయవంతం చేద్దాం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం ఘట్టాన్నీ విజయవంతం చేద్దామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. శనివారం ఉదయం జరగనున్న చక్రస్నానం ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తిరుమలలోని బ్రహ్మోత్సవం సెల్లో అధికారులతో సమీక్షించారు. పుష్కరిణిలో అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు తదితర ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. పుష్కరిణి సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నందున క్రౌడ్ మేనేజ్మెంట్లో పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సీవీఎస్వోను ఆదేశించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. పుష్కరిణిలో లోపల స్థలం పరిమితంగా ఉండటంతో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా పనిచేయాలన్నారు. పుష్కరిణిలో ప్రతి 20 మీటర్ల దూరానికి ఒక ఈతగాడిని, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 40 లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసినట్టు సీవీఎస్వో శ్రీధర్ వివరించారు. జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీకి రూ.6.81కోట్ల రాబడి
తిరుపతి(ఆర్టీసీ), అక్టోబరు 11: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రికార్డుస్థాయిలో భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల కొండకు రాకపోకలు సాగించారు. ఈ మేరకు ఉత్సవాల ఏడు రోజులకుగాను 404 బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 13,566 ట్రిప్పులతో 3,68,626మంది.. తిరుమల నుంచి తిరుపతికి 13,633 ట్రిప్పులలో 4,82,189 మంది ప్రయాణించారు. మొత్తం 8,50,815మంది రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో రాబడి కూడా దాదాపు రూ.6.81కోట్లు సమకూరింది.