Share News

మోదీ నాయకత్వాన.. ప్రగతి పథంలో భారత్‌

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:58 AM

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథాన తీసుకెళ్తోందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మోదీ నాయకత్వాన.. ప్రగతి పథంలో భారత్‌

5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎన్డీయే ప్రభుత్వమే ఉండాలి: పవన్‌

నా పిల్లలతో మరాఠీలోనే మాట్లాడతా.. ఆ భాషపై గౌరవంతోనే నేర్చుకున్నా

హైదరాబాద్‌ నుంచి వచ్చినవారు మన సంస్కృతిని అగౌరవపరుస్తున్నారు

సనాతన ధర్మంపై దాడిచేస్తే ఊరుకోను.. కచ్చితంగా పోరాడతా: డిప్యూటీ సీఎం పవన్‌

మహాయుతి అభ్యర్థుల తరఫున రెండో రోజూ ప్రచారం

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథాన తీసుకెళ్తోందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సుస్థిర పాలన, సమగ్ర అభివృద్ధితోనే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమని చెప్పారు. భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, మహారాష్ట్ర మహాయుతి సర్కారు ఉండాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ఆదివారం వరుసగా రెండో రోజూ ఆయన ప్రచారం నిర్వహించారు. చంద్రాపూర్‌ జిల్లా పరిధిలోని బల్లార్‌పూర్‌, పుణే కంటోన్మెంట్‌, చంద్రాపూర్‌ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ, బహిరంగ సభల్లో ప్రసంగించారు. బల్లార్‌పూర్‌ మినీ భారతదేశంలాంటిదని, ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు కలిసికట్టుగా ఉంటారన్నారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతరను ఈ నేలపై జరుపుకొంటారని చెప్పారు. కానీ హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి వచ్చిన కొందరు సమ్మక్క సారక్కను, బతుకమ్మను అపహాస్యం చేస్తున్నారని.. భారతీయ సంస్కృతిని, పండుగలను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

gh.jpg


సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారికి.. ఆ ధర్మాన్ని అవలంబించేవారు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని.. కచ్చితంగా బయటకు వచ్చి తన వంతు పోరాటం చేస్తానని ప్రకటించారు. జనసేన ఏర్పాటు వెనుక మహారాష్ట్రకు చెందిన మహానీయుల స్ఫూర్తి ఉందని.. తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్‌ ఠాక్రే ఉన్నారని తెలిపారు. ఆదివారం ఠాక్రే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఘన నివాళులు అర్పించారు. శివసేన, జనసేన రెండూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవేనని పవన్‌ చెప్పారు. తన ఇద్దరు పిల్లలతో మరాఠీలోనే మాట్లాడతానన్నారు. ఈ భాషపై గౌరవంతోనే మరాఠీ నేర్చుకున్నానని అన్నారు. పుణేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. తన ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుకున్నారని చెప్పారు. ఇక్కడ తనకు ఇల్లు కూడా ఉండేదని గుర్తుచేశారు. అయోధ్య రామాలయానికి అవసరమైన కలపను బల్లార్‌పూర్‌ సమకూర్చడం ఆనందంగా ఉందని తెలిపారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఉందని.. దానిని మూడో స్థానానికి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. అభివృద్ధి యాత్రను ఆపడానికి వీల్లేదని.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థికి ఓటేయాలని పిలుపిచ్చారు.

సంఘ్‌ లేని భారత్‌ను ఊహించలేం..

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) మద్దతు లేనిదే భారత్‌ బలంగా ఉండజాలదని పవన్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ లేని దేశాన్ని ఊహించుకోలేమన్నారు. ఆ సంస్థ ఉండడం వల్లే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయని తెలిపారు. తాను నెల్లూరులో స్కూల్లో చదువుకునేటప్పుడు వరద సహాయ కార్యక్రమాల్లో అది పాలుపంచుకుందని గుర్తుచేసుకున్నారు. ‘దేశాన్ని విభజించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలను, వారి సంస్కృతిని గౌరవిస్తూ దేశాన్ని సమైక్యంగా ఉంచాలి. తద్వారా భారత్‌ను బలోపేతం చేయాలి’ అని కోరారు. 2028కల్లా మహారాష్ట్రను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు ఎన్డీయే కట్టుబడి ఉందని పవన్‌ చెప్పారు.

Updated Date - Nov 18 , 2024 | 04:59 AM