శారదా పీఠానికి జగన్ గురుదక్షిణ
ABN , Publish Date - Nov 20 , 2024 | 03:24 AM
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
రూ. 300 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 15 లక్షలకే ఇచ్చేశారు
గత ప్రభుత్వం భూముల కేటాయింపుపై మండలిలో మంత్రులు అనగాని, అచ్చెన్న ఫైర్
గురుదక్షిణ అనడం సరికాదు: బొత్స
నిబంధనలకు విరుద్ధం కాబట్టి గురుదక్షిణే అంటారు: అచ్చెన్నాయుడు
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో శారదా పీఠానికి భూకేటాయింపుల రద్దు అంశంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ప్రజల హితం కోసం కాకుండా గురుదక్షిణగా జగన్ ప్రభుత్వం విలువైన భూములను ఆ పీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. భూములు కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించారన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రూ. 300 కోట్ల విలువైన భూమిని నిబంధనలు పాటించకుండా కేవలం రూ. 15 లక్షలకే శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఎకరా రూ. 1.5 కోట్లు విలువైన భూమిని కేవలం రూ. ఒక లక్షకే కేటాయించిందన్నారు. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం తెలపలేదని, ఎన్వోసీ తీసుకోలేదని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శారదా పీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేశామని చెప్పారు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరారని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘించి గురువుకు ఇచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారని చెప్పారు. శారదాపీఠానికి భూములు ఇచ్చింది తప్పేనని వైసీపీ సభ్యులు ఒప్పుకోవాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. శారదా పీఠంలో ఆక్రమణలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుదక్షిణ అనే పదంపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ధార్మిక సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వాల నుంచి కొనసాగుతోందన్నారు. పీఠాధిపతులుకు, మఠాధిపతులకు భూములు ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠానికి భూముల కేటాయింపు ఉంటే రద్దు చేయవచ్చని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు గురుదక్షిణగా ఇచ్చారని అనడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఈశా ఫౌండేషన్‌కి కూడా ఇచ్చిందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తాము గతంలో ఈశా ఫౌండేషన్‌కి ఇచ్చినపుడు నిర్ణీత సమయంలో నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో తాము వెనక్కి తీసుకున్నామన్నారు.