Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:00 PM
రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
అమరావతి: రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. కక్ష్య సాధింపు చర్యలు అనేవి ఎన్డీయే ప్రభుత్వంలో ఉండవని ఆయన తేల్చి చెప్పారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ అవినీతి చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
అగ్రిగోల్డ్ భూమిని చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసినందునే జోగి రాజీవ్ అరెస్టు జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పారు. ఈడీ అటాచ్మెంట్‌లో ఉన్న భూములు కొనుగోలు చేయటం ఎంత వరకు సబబో జోగి రమేశ్ చెప్పాలని మంత్రి అన్నారు. సర్వే నంబర్లు ఎందుకు మార్పులు చేశారో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకే ఆగస్టు 15నుంచి అన్న క్యాంటిన్లు పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర నుంచి కూడు లాక్కుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.