AP Politics: జగన్‌పై విశ్వాసం పోయిందా.. నాయకుల తిరుగుబాటు వెనుక అసలు కథ అదేనా..?
ABN , Publish Date - Aug 31 , 2024 | 09:21 PM
అధికారంలో ఉన్నప్పుడు జగన్ వైఖరికి.. ఎన్నికల తర్వాత వైఖరికి పెద్దగా మార్పులేదనే చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత అయినా ఆయన తన పద్ధతి మార్చుకుంటారని ఆశించామని..
'మా నమ్మకం నువ్వే జగన్' ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు మారుమోగించారు. ఎన్నికల ఫలితాల్లో మాత్రం జగన్‌ను ప్రజలు నమ్మడం లేదనే విషయం స్పష్టమైంది. ఎన్నికల ఫలితాలు విడుదలై మూడు నెలలవుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తుంటే సొంత పార్టీ నేతలకే జగన్‌పై విశ్వాసం లేదా అనే అనుమానం కలుగుతోంది. ఐదేళ్లపాటు జగన్ వెంట నడిచిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకుల్లో కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేయగా.. మరికొందు ఎప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పేదామా అనే ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. కొందరైతే ఏకంగా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఫలితాల తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ కోటరీ కారణంగానే ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయామని అంటూనే.. జగన్ తన వైఖరి మార్చుకోవాలంటూ కొందరు నాయకులు సూచించారు. ప్రస్తుతం మాత్రం జగన్ తమను అవమానించారని, జగన్ వైఖరి సరిగ్గా లేదంటూ సీనియర్లు పార్టీ వీడటం చూస్తుంటే జగన్ ప్రజలతో పాటు.. సొంత నేతల విశ్వాసం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.
RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..
వైఖరి మారలేదా..
అధికారంలో ఉన్నప్పుడు జగన్ వైఖరికి.. ఎన్నికల తర్వాత వైఖరికి పెద్దగా మార్పులేదనే చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత అయినా ఆయన తన పద్ధతి మార్చుకుంటారని ఆశించామని.. అయినా వైఖరిలో మార్పులేకపోవడంతో పార్టీ మారుతున్నామని జగన్‌కు గుడ్‌బై చెప్పిన నాయకులు చెబుతున్నారు. జగన్ తీరుతో ఇప్పటికే పార్టీ పూర్తిగా నష్టపోయిందని, భవిష్యత్తులో ఇదే తరహ పద్ధతిలో ముందుకెళ్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో మరికొందరు నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, ఎంపీలను పెద్దగా పట్టించుకోలేదని, కేవలం కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే జగన్ నడుచుకునేవారని, ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదనే విమర్శలు లేకపోలేదు. సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ప్రజల సమస్యలను పట్టించుకోని కారణంగానే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ తన వైఖరి మార్చుకోకపోవడంతోనే సీనియర్లు పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం
బెంగళూరులోనే..
ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత జగన్ తరచూ బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారు. వారంలో సగం రోజులు అక్కడే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత.. పార్టీ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవల్సిన జగన్.. ఆ పనిని పక్కనపెట్టి బెంగళూరులో ఎక్కువుగా ఉండటంపై కూడా సొంత పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం తమ సొంత పనులపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి.. కేడర్‌ను పట్టించుకోవడం లేదట. దీంతో స్థానికంగా ఉన్న నాయకులు అధికార పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుంటారా.. లేదా అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.
YS Sharmila: జగన్ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News