సేవ ముసుగులో నిలువు దోపిడీ
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:22 AM
వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు.
సాయిరెడ్డి వియ్యంకుడి ఆదాయం కోసమే ‘108’ వాహనాల కాంట్రాక్టు
అసెంబ్లీలో ‘అరబిందో’పై మంత్రి వెల్లడి
రోడ్డు ట్యాక్సూ ఎగ్గొట్టారు: ఎమ్మెల్యేలు
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు. ‘‘2019, డిసెంబరులో 108 సర్వీసు ప్రొవైడర్స్ కోసం టెండర్లు పిలిచారు. అరబిందో ఎమెర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంస్థలకు చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ అండ్ సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసెస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు ఈ బిడ్ దక్కించుకుంది. 2020 ఏప్రిల్ 20న అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పటికే ఉన్న 336 అంబులెన్స్‌లు, 432 కొత్త అంబులెన్స్‌లను ఈ సంస్థకు అప్పగించారు. మొత్తం 768 అంబులెన్స్‌లలో 731 ఎక్కడైనా వాడుకునేలా, 37 అంబులెన్స్‌లను బ్యాక్‌పలో ఉంచుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అరబిందో సంస్థ జూలై, 2020 నుంచి రంగంలోకి దిగింది. 768 అంబులెన్స్‌లలో 189 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నవి కాగా, 579 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు.
ఇవన్నీ ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశారు. ఒక్కో వాహనానికీ నెలకు రూ.2,21,257 చెల్లించారు. పాత వాహనాలకు రూ.1,78,072 చెల్లించారు. ఈ సంస్థ 2021 నుంచి 2024 లోపు 34,48,540 ఎమెర్జీన్సీ సర్వీసులను అందించింది. అరబిందో సంస్థ ఫోర్స్ అనే సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నా సర్వీసు కోసం సొంతగా ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే వాహనాల ఫిట్నెస్ బాగా ఉన్నాయని సర్టిఫికేట్లు ఇచ్చుకున్నారు. సేవ ముసుగులో ప్రజాధనాన్ని దోచి పెట్టారు’’ అని వివరించారు.
అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వియ్యంకుడికి ఆదాయం కల్పించేందుకు అరబిందో సంస్థకు 108 అంబులెన్స్‌లను కేటాయించారన్నారు. గోల్డెన్ అవర్‌లో 17.80 లక్షల కాల్స్‌కు స్సందించలేదని, దీంతో వందల మంది ప్రాణాలు పోయాయన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి కోరారు. మరో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ స్వచ్ఛంద సేవల ముసుగులో అంబులెన్స్ నిర్వహణతో అరబిందో దోపిడీకి తెరదీసిందన్నారు. అంబులెన్స్‌లకు సంబంధించి రోడ్డుట్యాక్స్ ఎగ్గొట్టారని సభకు తెలిపారు.