Share News

AP Cabinet: హామీల అమలుకు శ్రీకారం

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:56 AM

మెగా డీఎస్సీ, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన..

AP Cabinet: హామీల అమలుకు శ్రీకారం
AP Cabinet Meeting

  • తొలి కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు..

  • ఆ 5 సంతకాలకు ఆమోదం

  • గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ

  • జూలై నుంచి పెంచిన పింఛన్‌

  • 1న బకాయితో కలిపి చేతికి రూ.7 వేలు

  • సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు ఆమోదం

  • తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు

  • రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణనకు నిర్ణయం

  • ఇక ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీనే

  • 7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు ఓకే

పూర్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రాజీనామాలను ఆమోదిస్తూ, అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివా్‌సను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది.

గత ప్రభుత్వ అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 7 శ్వేతపత్రాలను విడుదల చేస్తారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం(ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌, జియాలజీ మొదలైనవి) మద్యం, శాంతిభద్రతలు, ఆర్థిక రంగంపై ఈ శ్వేతపత్రాలు ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు విడుదల అవుతాయి.

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన... ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన ‘ఐదు తొలి సంతకాల’ అమలుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్‌ సమావేశంలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్‌పై ‘గంజాయి రాజధాని’గా పడిన ముద్ర తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గంజాయితోపాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దీనికోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లను జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి సహా ఏడు అంశాలపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిశ్చయించింది.

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ‘కూటమి’ సర్కారు తొలి కేబినెట్‌ భేటీ జరిగింది. ఆ వివరాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనీ, కళాశాలలు, పాఠశాలలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదని కొలుసు అన్నారు. దీని నివారణకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ‘‘రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు తగు సూచనలు చేసేందుకు హోమ్‌,గిరిజన సంక్షేమం, విద్యాశాఖ, ఎక్సైజ్‌, వైద్యఆరోగ్యశాఖలకు చెందిన మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది’’ అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా దాని పేరు మార్చింది.


దీనివల్ల గతంలో ఈ యూనివర్సిటీలో చదివిన డాక్టర్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందువల్ల యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది’’ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఐదు అంశాలకు కేబినెట్‌ తొలి సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. మెగా డీఎస్సీ, ఏపీ భూహక్కుచట్టం- 2022 రద్దు, వృద్ధాప్య పింఛన్ల పెంపు, ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య సెన్సెస్‌-2024 నిర్వహణ, అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది. ‘కూటమి పార్టీలు ఎన్నికల ముందే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి.

ఆ మేరకు 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం టెట్‌ పరీక్షలను ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారు. ఈ నేపఽథ్యంలో ఇకపై టెట్‌ పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది’’ అని కొలుసు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ భూహక్కు చట్టం- 2022 రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కొలుసు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితరుల పింఛన్‌ మొత్తాన్ని రూ.3 వేలనుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు.

‘‘పెన్షన్‌ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. రూ.4 వేలకు పెంచిన పింఛన్‌ మొత్తాన్ని ఏప్రిల్‌, మే, జూన్‌లకు పెరిగిన రూ.1000 చొప్పున కలిపి ప్రతి పింఛన్‌దారుకు మొత్తంగా రూ.7 వేల పింఛన్‌ మొత్తాన్ని జూలై 1న అందిస్తాం. సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే పంపిణీ చేయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు ప్రభుత్వం పెంచింది. పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5వేల పింఛన్‌ను రూ.15 వేలకు, కిడ్నీ, లివర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. ఈ విధంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్లు అదనపు భారం పడుతుంది. బకాయిలతో కలిపి నెలకు రూ.4408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని కొలుసు వివరించారు.

3, 4 నెలల్లో నైపుణ్య సర్వే పూర్తి..

ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య సెన్సెస్‌-2024 నిర్వహణకు సిద్ధమవుతోందని మంత్రి కొలుసు తెలిపారు. దీనిపై కేబినెట్‌ ఆమోదం లభించిందన్నారు. ‘‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనికపై మన ముద్ర పడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేనెబిట్‌ భావించింది. ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేస్తాం. అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం’’ అని వివరించారు.


అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ.. తొలిదశలో 183 క్యాంటీన్లు

గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను కక్షపూరితంగా మూసేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేసిందని మంత్రి కొలుసు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పేదవాడి ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన రోజునే అన్న క్యాంటీన్‌లను పునరుద్దరిస్తూ సంతకం పెట్టారు. వీటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. 203 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిదశలో 183 క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లు తదుపరి దశలో ప్రారంభమవుతాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సబ్సిడీ ధరకు రూ.5లకే అన్న క్యాంటీన్లలో అందుతుంది’’ అని తెలిపారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 25 , 2024 | 08:28 AM