AP Floods: పవన్ ఎక్కడ.. ఇదిగో సమాధానం
ABN , Publish Date - Sep 03 , 2024 | 08:31 PM
ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో మరణించారు.
అమరావతి, సెప్టెంబర్ 03: ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో మరణించారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ విపత్తు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ కీలక నేతలు విమర్శించారు. ప్రభుత్వంలోని మంత్రులు సైతం ఈ విపత్తుపై స్పందించడం లేదని ఆరోపణలు సంధించారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మంగళవారం స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న వరద పరిస్థితులతోపాటు సహాయక చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అందులోభాగంగా పంచాయతీరాజ్ శాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతోపాటు గ్రామీణ నీటిసరఫరా శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
అలాగే క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలను ఆయన పరిశీలిస్తున్నారని చెప్పింది. ఆ క్రమంలో యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆ యా శాఖల ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జనసేన పార్టీ ఈ సందర్బంగా స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా వివరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు తెలుగు వార్తల కోసం...