Share News

అధ్యక్షా..! సభలో ఒక్క అధికారీ లేడు

ABN , Publish Date - Nov 19 , 2024 | 05:18 AM

ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.

అధ్యక్షా..! సభలో  ఒక్క అధికారీ లేడు

  • పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తిన కొణతాల

  • పైన కూర్చొని నోట్‌ చేసుకుంటున్నారు: మంత్రి అచ్చెన్న

  • కవర్‌ చేయకండి మంత్రి గారూ... స్పీకర్‌ అయ్యన్న

  • అధికారుల్లో పాత వాసనలు పోలేదని ఎమ్మెల్యేలు ద్వజం

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్లపై చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు సభలో లేకపోవడంపై కొణతాల రామకృష్ణ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. ‘సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారులకు కేటాయించిన సీట్లలో ఒక్కరు కూడా లేరు చూడండి అధ్యక్షా! దీన్నిబట్టే వారి పనితీరు అర్థమవుతుంది’ అని అన్నారు. అప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు లేచి ‘అధికారులు పైన ఉన్న బాక్స్‌లో ఉన్నారు. రాసుకుంటున్నారు’ అన్నారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ ‘కవర్‌ చేయొద్దు మంత్రి గారూ!’ అంటూ చురకంటించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడకుండా కూర్చున్నారు.

ఆ వెంటనే ఇద్దరు, ముగ్గురు అధికారులు సభలోకి వచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. అనంతరం డిమాండ్లపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలను, పంచాయతీలను అనుసంధానం చేసి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి’ అని కోరారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో మైనారిటీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి. అమరావతి ప్రాంతాలో ఇస్లామిక్‌ రీసెర్చ్‌ సెంటరు ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలి’ అని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి తమ ఇష్టానుసారం ఖర్చు చేసేస్తే.. ఇక చట్టసభల్లో చర్చించి ఆమోదించిన బడ్జెట్‌కు విలువ ఏముంటుందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రశ్నించారు.


చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాడు పుల్లారావు, చోడవరం ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి, నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్‌ తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు.

  • ఆరు పద్దులకు ఆమోదం

వివిధ శాఖల మంత్రులు ప్రతిపాదించిన ఆరు డిమాండ్ల (పద్దులు)పై శాసనసభలో చర్చ జరిగింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌, హెచ్‌ఆర్‌డీ, నైపుణ్యాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ తరఫున మంత్రి నారాయణ, మిగిలిన శాఖలకు ఆయా మంత్రులు పద్దులు ప్రతిపాదించారు. చర్చ అనంతరం సభ ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Updated Date - Nov 19 , 2024 | 05:18 AM