Share News

AP News: వైసీపీ నేత అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే..

ABN , Publish Date - Jul 30 , 2024 | 01:34 PM

తిరువూరులో దేవదాయ శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్ దార నీలిమ భర్త శ్రీనివాసరావు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వివాదాస్పద దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.శాంతి అండదండలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

AP News: వైసీపీ నేత అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే..

ఎన్టీఆర్: తిరువూరులో దేవదాయ శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్ దార నీలిమ భర్త శ్రీనివాసరావు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వివాదాస్పద దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.శాంతి అండదండలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థలం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి సత్రంగా ఉండేది. నిబంధనలు ఊల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ బహుళ అంతస్తులు నిర్మించారు.


గతంలో అక్కడ భద్రాచలానికి వెళ్లే యాత్రికులకు విడిది సత్రం ఉండేది. సత్రానికి వంశపారపర్య ధర్మకర్తగా ఉన్న వైసీపీ నేత దార శ్రీనివాసరావు గుడిసత్రం తొలగించి దేవదాయ, నగర పంచాయతీ అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలంటూ గతంలో నగర పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ ఆయన నిర్మాణాలు చేపట్టారు.


అయితే తిరువూరులో రహదారికి ఇరువైపులా డ్రైనేజీపై నిర్మించిన అక్రమ కట్టడాలను నిన్న(సోమవారం) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. అదే సమయంలో దార శ్రీనివారావు నిర్మిస్తున్న భవనాన్ని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం నిర్మాణం ఆపేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అక్రమ కట్టడాన్ని నిలిపివేసి భవనంపై శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రం అంటూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కంభంపాడులో వైసీపీ నేత భర్త అక్రమంగా భవనం నిర్మించారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూల్చివేయించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 30 , 2024 | 01:34 PM