Share News

Nellore : కళతప్పిన కృష్ణపట్నం

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:14 AM

కృష్ణపట్నం పోర్టు.. రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కేంద్రం. మూడేళ్ల క్రితం వరకు దేశంలోనే పెద్ద కంటైనర్‌ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. జగన్‌ ప్రభుత్వంలో పోర్టు యాజమాన్య బాధ్యతలు నవయుగ నుంచి అదానీకి మారడంతో పరిస్థితి మారిపోయింది.

Nellore : కళతప్పిన కృష్ణపట్నం

  • అదానీ స్వార్థం, కాకాణి దందాలకు బలి

  • కంటైనర్‌ కార్గో నిలిపివేతతో తీరని నష్టం

  • రోడ్డునపడ్డ వేలాదిమంది ఉద్యోగులు

  • ఎగుమతుల్లేక సాగు ఉత్పత్తుల ధర పతనం

  • గ్రానెట్‌ పరిశ్రమపైనా పెనుభారం

  • (నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

కృష్ణపట్నం పోర్టు.. రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కేంద్రం. మూడేళ్ల క్రితం వరకు దేశంలోనే పెద్ద కంటైనర్‌ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. జగన్‌ ప్రభుత్వంలో పోర్టు యాజమాన్య బాధ్యతలు నవయుగ నుంచి అదానీకి మారడంతో పరిస్థితి మారిపోయింది. అదానీ స్వార్థం, నాటి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అక్రమ వసూళ్ల కారణంగా పోర్టు క్రమేణా నిర్వీర్యం అయింది. వ్యాపారం తగ్గిందనే సాకు చూపి అదానీ కంటైనర్‌ కార్గో నిలిపివేసి, సొంత వ్యాపార ప్రయోజనాల కోసం పోర్టును డర్టీ కార్గోగా మార్చివేసింది. తమిళనాడులో అదానీకే చెందిన ఎన్నూరు పోర్టులో బొగ్గు, ఐరన్‌ కార్గో పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత రావడంతో కృష్ణపట్నం పోర్టుకు మార్చింది.

కంటైనర్‌ కార్గో నిలిపివేతతో ఎగుమతుల్లేక వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పతనం చేసింది. రాయలసీమ గ్రానైట్‌ పరిశ్రమలను దెబ్బతీసింది. వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులను వీధిన పడేసింది. పోర్టు ఆధారంగా ఏర్పడిన పరిశ్రమలను శాశ్వతంగా మూసేలా చేసింది. వైసీపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2019 వరకు ఉజ్వలంగా వెలిగిన కృష్ణపట్నం పోర్టు గత మూడేళ్ల కాలంలో నిర్వీర్యమైంది. పోర్టును నమ్ముకున్న రైతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.

నవయుగ నుంచి అదానీకి

కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకర్గ రైతుల త్యాగఫలంతో ఏర్పాటైంది. 1996లో పోర్టు స్థాపించారు. 2007 నుంచి కంటైనర్‌ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. 2020 మార్చి వరకు ఈ పోర్టు నవయుగ సంస్థ ఆధీనంలో నడిచింది. 2007 నుంచి 2020 వరకు పోర్టులో కంటైనర్‌ ఆపరేషన్లు అద్భుతంగా నడిచాయి. మొత్తం 14 బెర్తుల్లో 4 బెర్తులు కంటైనర్‌ కార్గోకు కేటాయించారు. వీటి ద్వారా రాష్ట్రం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానెట్‌ తదితరాలు ఎగుమతయ్యేవి. పరిశ్రమలకు సంబంధించిన మిషనరీ తదితరాలు విదేశాల నుంచి దిగుమతయ్యేవి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోర్టుకు గ్రహణం పట్టింది. నవయుగ సంస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి. 2020లో పోర్టును అదానీ చేతుల్లో పెట్టకతప్పని పరిస్థితులను నవయుగ సంస్థకు కల్పించారు.


ఈ కుట్రలో అప్పటి సీఎం జగన్‌ హస్తం ఉందనే ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. 2019కి ముందు రాజకీయాలకు అతీతంగా పోర్టులో వ్యాపార కార్యకలాపాలు సాగేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోర్టుపై ఆ పార్టీ నాయకుల పెత్తనం పెరిగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన కాకాణి గోవర్థన్‌రెడ్డి కృష్ణపట్నం పోర్టు వ్యవహారాల్లోకి కాలుపెట్టారు. ఒకవైపు కాకాణి వర్గం అక్రమ వసూళ్లు దందా సాగిస్తుండగా, అదే సమయంలో అదానీ ముందస్తు వ్యూహంతో బెర్త్‌ ఇన్‌చార్జిలు, హ్యాండిలింగ్‌ చార్జీలు భారీగా పెంచేశారు. భరించలేక పలువురు పెద్ద లైనర్లు కృష్ణపట్నం పోర్టుకు రావడం మానేశారు. కృష్ణపట్నం కంటైనర్‌ బిజినె్‌సలో మస్క్‌ వాటానే 50 శాతం. ఆయన రెండేళ్ల క్రితమే కృష్ణపట్నం పోర్టు వదిలి పెట్టేశారు.

దీంతో కంటైనర్‌ బిజినెస్‌ ఒక్కసారిగా సగానికి పడిపోయింది. అదానీకి చెందిన ఎన్నూరు (తమిళనాడు) పోర్టులో ఆ కంపెనీ ఉత్పత్తులైన బొగ్గు, ఐరన్‌ ఓర్‌ కార్గో పట్ల స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో బొగ్గు, ఐరన్‌ ఓర్‌ తదితర డర్టీ కార్గోను కృష్ణపట్నం మార్చారు. ఇక్కడ వ్యాపారం తగ్గిందనే సాకు చూపి ఎన్నూరు పోర్టును కంటైనర్‌ కార్గోగా మార్చుకొని, కృష్ణపట్నం పోర్టును డర్టీ కార్గోగా మార్చేశారు. 2024 జనవరి 31 నుంచి పోర్టులో కంటైనర్‌ కార్గో పూర్తిగా ఆపేశారు.


దీంతో ఎగుమతుల్లేక వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానెట్‌ ధరల పతనం మొదలైంది. ప్రధానంగా నెల్లూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి సగటున నెలకు 1000 కంటైనర్ల బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యేది. ఒక్కో కంటైనర్‌లో 25 టన్నుల బియ్యం బస్తాలు చొప్పున నెలకు 25 వేల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేది. పూర్తిగా ఆగిపోవడంతో ఇప్పుడు చెన్నై, ఎన్నూరు పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల అదనపు రవాణా చార్జీలు, హ్యాండిలింగ్‌ చార్జీలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం వరి ధాన్యం ధరలపై పడుతోంది. కంటైనర్‌ కార్గో ఆగిపోవడంతో పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2-3 వేల కోట్లు నష్టపోతుందన్నది అంచనా.

కాకాణి అవినీతితో ముసలం

కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ కార్గో మూతపడటానికి ప్రధాన కారణం కాకాణి గోవర్ధన్‌రెడ్డి అవినీతే అనే వాదన బలంగా వినిపిస్తోంది. 2021కి ముందు పోర్టులో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు ప్రధాన పార్టీల నాయకులు పంచుకునేవారు. అధికార పార్టీ నాయకులు 60 శాతం, ప్రతిపక్షనేతలు 40 శాతం పనులు చేసుకునేవారు. ంటైనర్‌ కార్గో కాంట్రాక్టులను మాత్రం సర్టిఫైడ్‌ కంపెనీలకే కేటాయించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కంటైనర్‌ కార్గో కార్యకలాపాల ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో స్థానిక వైసీపీ నాయకులు లారీ అసోసియేషన్‌ అనే దానిని ఏర్పాటు చేసుకున్నారు.


పోర్టులోకి కంటైనర్లను రవాణా చేసే యజమానులను భయపెట్టి అసోసియేషన్‌లో చేర్చుకున్నారు. పోర్టు బయట ఒక టోల్‌గేట్‌ పెట్టి లారీలను ఆపేయించారు. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దింపి లారీ టైర్లలో గాలి తీయించారు. పోలీసులు, ఆర్టీఏ అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించారు. ఈ టోల్‌గేట్‌కి కాకాణి టోల్‌గేట్‌ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది.
దీంతో విధిలేక ట్రాన్స్‌పోర్టర్లు అందరూ ఈ అసోసియేషన్‌లో చేరారు. తర్వాత దందాలు మొదలయ్యాయి. ప్రతి వాహనం కాకాణి టోల్‌గేట్‌ వద్ద రూ.2వేలు చెల్లించాలి. అంతేగాక కంపెనీ లేదా డీలర్‌ ట్రాన్స్‌పోర్టర్‌కు చెల్లించే అద్దెలో 20 శాతం కమీషన్‌ ఇవ్వాలి. ఇలా లారీ అసోసియేషన్‌ పేరుతో ప్రతి లోడుపై రూ.5-7 వేలు దండుకున్నారు. కమీషన్ల బెడదతో ట్రాన్స్‌పోర్టర్లు, డీలర్లు ఈ పోర్టుకు రాకుండా చెన్నై పోర్టుకు వెళ్లడం ప్రారంభించారు. అయినా వైసీపీ గ్యాంగ్‌ అరాచకాలు ఆపలేదు. అనధికారిక టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి వెంకటాచలం హైవే మీదుగా వెళ్లే వారి నుంచి వసూళ్లు చేసింది. దీన్ని కాకాణి టోల్‌గేట్‌ నంబర్‌-2గా పిలిచేవారు.

ఎన్నో అనర్థాలు...

కంటైనర్‌ కార్గో ద్వారా గతంలో 10 వేలమంది ఉద్యోగులు పోర్టులో పనిచేసేవారు. పోర్టులో 600 కంపెనీల కార్యకలాపాలు ఉండేవి. ఇప్పుడు కార్గో మూతపడటంతో వీరందరూ ఉపాధి కోల్పోయారు. ఆరు వేల ఎకరాల్లో విస్తరించిన పోర్టులో ప్రస్తుతం నికరంగా పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులు 300 నుంచి 400 మంది మాత్రమే. బొగ్గు దిగుమతుల కారణంగా కాలుష్యం విస్తరిస్తోంది. ముత్తుకూరు, చిల్లకూరు మండలాల్లో విషకారకాల వల్ల ప్రజలకు చర్మవాధులు వస్తున్నాయి. బొగ్గురేణువుల కాలుష్యం నెల్లూరు నగరం హరినాథపురం వరకు వస్తోంది. భవిష్యతులో పోర్టు కాలుష్యం నెల్లూరు నగరంతో పాటు గూడూరు, సూళ్లూరుపేట, కావలి, కందుకూరు డివిజన్ల ప్రాంతాలను సైతం కమ్మేస్తుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Jul 19 , 2024 | 04:14 AM