Share News

సామూహిక వరలక్ష్మీ వ్రతం

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:11 AM

శ్రీశైల మహాక్షేత్రంలో నాలుగో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

సామూహిక వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలు

శ్రీశైలం, ఆగస్టు 30: శ్రీశైల మహాక్షేత్రంలో నాలుగో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ వ్రతాన్ని ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి ప్రత్యేక పూజలు జరిపి, అనంతరం వేదికపై ఆశీనులనుజేసిన స్వామి, అమ్మవర్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులతో వ్రతాన్ని ప్రాంరంభించారు. అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను భక్తులకు వివరించారు. ఈ వరలక్ష్మీవ్రతంలో పాల్గొనేందుకు చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందులో 600 మందికి పైగా చెంచులు, 900 మంది ఇతరులు మొత్తం 1500 మందికి పైగా పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న ముత్తైదులందరికీ వ్రతానికి సంబంధించిన పూజాద్రవ్యాలన్నీంటినీ దేవస్థానం సమకూర్చింది. అదేవిధంగా వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న వారికి అమ్మవారి శేషవస్త్రాలుగా చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, ప్రసాదాలు, శ్రీశైలప్రభ సంచికను అందజేశారు. వ్రతం అనంతరం వారికి స్వామి, అమ్మవార్ల దర్శంనం కల్పించడంతో పాటు దేవస్థానం అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాదాలను అందజేశారు. ఈ వ్రత మహోత్సవంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు. ఈ వ్రత మహోత్సవాన్ని భక్తులందరూ సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 01:11 AM