Share News

సీఎం నిర్ణయంతో ట్రాక్టర్‌ ఇసుక ధర 900లే!

ABN , Publish Date - Nov 19 , 2024 | 04:46 AM

ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితంగా తీసుకు వెళ్ల వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్న తర్వాత...

సీఎం నిర్ణయంతో ట్రాక్టర్‌ ఇసుక ధర 900లే!

  • నెల్లూరు రూరల్‌ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితంగా తీసుకు వెళ్ల వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్న తర్వాత తమ జిల్లాలో ఇసుక ధర భారీగా తగ్గిపోయిందని, ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.900కు పడిపోయిందని నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.4వేల నుంచి రూ.7 వేలకు చేరింది. ఇప్పుడు ఇసుక తక్కువ ధరకు ఎంత కావాలంటే అంత దొరుకుతుండటంతో నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పనులు ఉంటున్నాయి’ అని ఆయన వివరించారు.

  • అలా అయితే జగన్‌ అసెంబ్లీకి వస్తారు

‘జగన్‌ రెడ్డికి మైకు కావాలి. రోజూ ఆయనకు ఒక గంటపాటు అసెంబ్లీలో మైక్‌ ఇస్తానని స్పీకర్‌ హామీ ఇస్తే ఆయన రేపటి నుంచే సభకు వస్తారు’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్‌ ప్రజా సమస్యలపై ఏనాడూ సభలో పోరాడలేదు. తన మైక్‌ కోసమే పోరాడాలని ఆయన అప్పట్లో మాకు చెప్పేవారు’ అని కోటంరెడ్డి అన్నారు.

  • మాకు ఇసుక సమస్య తీరలేదు: రామకృష్ణారెడ్డి

తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘గోదావరి నదిలో ఇంకా ప్రవాహం పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఇసుక ఎక్కువ రావడం లేదు. యంత్రాలు వాడకుండా కేవలం మనుషులతోనే నదిలో నుంచి ఇసుక తీయాలని అధికారులు పట్టుబడుతుండటంతో ఇసుక లభ్యత పెరగడం లేదు. ఇసుక చాలినంత దొరుకుతుంటే ధరలు అవే దిగివస్తాయి. దీనికి మార్గం ఏమిటో అధికారులు ఆలోచన చేయాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 19 , 2024 | 04:46 AM