YS Sharmila : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:23 AM
‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
అధిక ధరకు కొనడం భారం కాదా?
నిజాన్ని దాచలేరు.. లంచం తీసుకున్నది నిజం: షర్మిల
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 2022లో సోలార్ విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.2.14 పలికిందంటూ నేను చేసిన ట్వీట్‌పై బదులు ఇవ్వడంలో తెర వెనుక ఎవరున్నారు? అని ఆమె నిలదీశారు. శనివారం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు. ‘ఇవి మీ రాతలేనా? సాక్షి పంపిన స్ర్కిప్టా? లేదంటే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి రాసినవా? దేశంలో సోలార్ విద్యుత్తు ధరలు గణనీయంగా తగ్గుతుంటే.. 25 ఏళ్లకు సెకీతో ఎందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు? ఐదేళ్ల తర్వాత సోలార్ విద్యుత్తు యూనిట్ రూ.1.50కే పడిపోవచ్చునేమో? ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా, ఏకపక్షంగా అదానీ వద్ద రూ.2.49కు ఎందుకు కొన్నారు? అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? 2020లో గుజరాత్లో సోలార్ విద్యుత్తు ధర రూ.1.99 మాత్రమే. వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ అదానీ నుంచి 2021లో 50 పైసలు ఎక్కువగా పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా? అదానీతో చేసుకొన్న కొనుగోలు ఒప్పందం వల్ల యూనిట్ రూ.2.49కే వస్తుందని చెప్పినా .. వీలింగ్ చార్జీలు, జీఎ్‌సటీ అన్నీ కలిపి రూ.4.46 పడుతుందని విద్యుత్తు అధికారులే చెబుతుండటంపై ఏం సమాధానం చెబుతారు? 2019లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడంలో మర్మమేమిటి? నిజాన్ని దాచలేరు. రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నది వాస్తవం’ అని తేల్చి చెప్పారు.