Share News

YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:45 AM

YS Jagan: జగన్‌ తన సొంత పత్రికకు ఐదేళ్లపాటు జనం సొమ్మును దోచిపెట్టారు. గత ప్రభుత్వంలో ‘సాక్షి’ పత్రికకు ఏకంగా రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు.

YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము
YS Jagan

  • ఐదేళ్లలో రూ.371 కోట్ల ప్రకటనలు

  • ఇతర పత్రికలన్నింటికీ కలిపి 488 కోట్లు

  • ‘ఆంధ్రజ్యోతి’కి పూర్తిగా నిలిపివేత

  • ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి

  • శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి

  • ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తాం

  • అవసరమైతే సభా సంఘం ఏర్పాటు

  • మంత్రి పార్థసారథి వెల్లడి

అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జగన్‌ తన సొంత పత్రికకు ఐదేళ్లపాటు జనం సొమ్మును దోచిపెట్టారు. గత ప్రభుత్వంలో ‘సాక్షి’ పత్రికకు ఏకంగా రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. మిగిలిన అన్ని పత్రికలకూ కలిపి రూ.488 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు ఇవ్వలేదు. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో సహా ఈ వివరాలను వెల్లడించింది. గత ప్రభుత్వం ప్రకటనల జారీలో సర్క్యులేషన్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదని, పక్షపాత ధోరణితోనే ప్రకటనలు జారీ చేసిందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయిస్తామని, అవసరమైతే సభాసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

గత ప్రభుత్వంలో వార్తా పత్రికలకు ప్రకటనల జారీ అంశంలో పక్షపాత ధోరణిపై ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, బెందాళం అశోక్‌, తెనాలి శ్రవణ్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలపై శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ఈ ప్రశ్నకు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిచ్చారు. జీవో 431 ప్రకారం ప్రకటనల జారీలో ఐ అండ్‌ పీఆర్‌ శాఖకు విచక్షణాధికారం ఉందని, దీనిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. పూర్తిగా పక్షపాత ధోరణితో ప్రకటనలు ఇచ్చారన్నారు. ఈ ఒక్క శాఖ నుంచే కాకుండా ఇతర శాఖల నుంచి కూడా భారీగా సాక్షికి ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. ఈనాడు లాంటి పత్రికలు ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదనే కారణంతో ప్రకటనలు వద్దని చెప్పాయని తెలిపారు. సచివాలయాలకు సాక్షి పత్రిక వేసిన అంశం సమాచార, పౌరసంబంధాల శాఖకు సంబంధం లేదన్నారు. ఈ శాఖలోని అధికారులను రిలీవ్‌ చేయొద్దని డిమాండ్లు ఉన్నాయని, వారు రిలీవ్‌ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


‘ఆంధ్రజ్యోతి’కి ఎందుకు ఇవ్వలేదు?

ప్రభుత్వాన్ని ఇప్పటికీ ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. పత్రికల ఏబీసీ వివరాలు సభ ముందు పెట్టాలని కోరారు. సర్క్యులేషన్‌ ప్రకారం ప్రకటనలు ఇవ్వాల్సి ఉందని, ‘ఆంధ్రజ్యోతి’కి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సాక్షికి అత్యధిక స్థాయిలో ఎందుకిచ్చారని నిలదీశారు. ఇది పెద్ద కుంభకోణమని, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌ రెడ్డిని రిలీవ్‌ చేయొద్దని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారినా అధికారులు ఇంకా మారలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. పక్షపాత ధోరణి కనిపిస్తున్నా పక్షపాతం లేదనే కోణంలో మంత్రికి సమాచారం ఇచ్చారన్నారు. సాక్షికి అప్పనంగా ప్రకటనలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మీడియాను అడ్డుపెట్టుకుని జగన్‌ అనేక పాపాలు చేశారని బెందాళం అశోక్‌ విమర్శించారు. సచివాలయాలకు బలవంతంగా సాక్షి పత్రిక వేయించారని, సభా సంఘం వేసి ఆ నగదును రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు.


జగన్‌ భజన కోసమే..

జగన్‌ భజన కోసం గత ప్రభుత్వం రూ.859 కోట్లు ఖర్చు చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఒక్క సాక్షికే రూ.371 కోట్ల ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్క్యులేషన్‌ లేని పత్రికలకు కూడా భారీగా ప్రకటనలు ఇచ్చారని, రూ.120 కోట్లు డిజిటల్‌ కార్పొరేషన్‌కు ఇచ్చారని చెప్పారు. కూలి మీడియా, నీలి మీడియాకు రూ.వందల కోట్ల ప్రకటనలు ఇచ్చారన్నారు.


వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రకటనలు (రూ.) పత్రిక ప్రకటనల విలువ

  • ఈనాడు 243.37 కోట్లు

  • సాక్షి 371.12 కోట్లు

  • ఆంధ్రజ్యోతి 27.98 లక్షలు

  • ఆంధ్రప్రభ 16.49 కోట్లు

  • టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 27.21 కోట్లు

  • డెక్కన్‌ క్రానికల్‌ 45.82 కోట్లు


పాత అధికారుల రోత పనులు!

గత ప్రభుత్వం పత్రికలకు ప్రకటనల జారీ అంశంపై చర్చలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథిని, మొత్తంగా సభనూ తప్పుదారి పట్టించారు. ఆ శాఖలో జగన్‌ హయాంలో పని చేసిన అధికారులే కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. ‘2019-24 మధ్య కాలంలో వార్తా పత్రికలకు ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి వాస్తవమేనా?’ అని ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు... అధికారులు ‘లేదు’ అని సమాధానమిచ్చారు. మంత్రి పార్థసారథి ఇదే సమాధానాన్ని సభకు చెప్పారు. కానీ... ఆయనే విడుదల చేసిన ప్రకటనల గణాంకాలు జగన్‌ పత్రికకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించాయి. దీంతో... ఓవైపు భారీగా ప్రకటనలు ఇచ్చినట్లు అంకెలు చెబుతుంటే, పక్షపాతం లేదని ఎలా చెబుతారని సభ్యులు నిలదీశారు. దీంతో మంత్రి పార్థసారథి ఇరకాటంలో పడ్డారు. జీవో 341 ప్రకారం శాఖకు విచక్షణాధికారం ఉన్నందున తాను అలా చెప్పానని, అంతేకానీ వాస్తవాలు దాయాలని కాదని వివరణ ఇచ్చారు. వాస్తవాలు దాచే ఉద్దేశం ఉంటే గణాంకాలు ఎందుకు విడుదల చేస్తామని ప్రశ్నించారు. సభ్యుల డిమాండ్‌తో సభా సంఘం అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.


అరకొర సమాచారమే...

జగన్‌ పత్రికకు సమాచార శాఖ ద్వారా జారీ అయిన ప్రకటనల విలువే రూ.371 కోట్లు. జగన్‌ చానల్‌కు కూడా కోట్లలో జనం సొమ్ము గుమ్మరించారు. ఇక... జిల్లా స్థాయిలో జగన్‌ పత్రికకు ఇచ్చిన ప్రకటనల విలువ కూడా సభ దృష్టికి తీసుకురాలేదు. ఇవన్నీ కలిపితేగానీ జగన్‌ మీడియాకు దోచిపెట్టిన జనం సొమ్ము నికరంగా ఎంతనేది తెలియదు. మరోవైపు... జిల్లాల్లో జగన్‌ పత్రికకు జారీ చేసిన ప్రకటనల విలువ ఎంతో తెలియచేయాలంటూ శుక్రవారం అన్ని జిల్లాల డీపీఆర్వోలను ప్రభుత్వం ఆదేశించింది.


Nagarjuna Sagar: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

Krishna basin: కృష్ణమ్మ బిరబిరా.. శ్రీశైలం కళకళ!

Kottur: దొంగలను పట్టించిన యూపీఐ చెల్లింపు..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 08:09 AM