Share News

Andhra Pradesh : రక్తమోడుతున్నా ప్రతిఘటన

ABN , Publish Date - May 24 , 2024 | 04:03 AM

మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులను పోలింగ్‌ నాడు ప్రతిఘటించిన టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావు ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.

Andhra Pradesh : రక్తమోడుతున్నా ప్రతిఘటన

తీవ్రంగా గాయపడీ.. వైసీపీ మూకలను

వెంబడించిన శేషగిరిరావు... ఆలస్యంగా వీడియో వెలుగులోకి

గుంటూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులను పోలింగ్‌ నాడు ప్రతిఘటించిన టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావు ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఈ నెల 13న పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లోకి పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టాడు. అక్కడ ఉన్న పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నప్పటికీ టీడీపీ ఏజెంట్‌గా ఉన్న శేషగిరిరావు పిన్నెల్లిపైకి దూసుకెళ్లాడు.

ఇంతవరకు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఆ రోజు ఈవీఎం ధ్వంసం తర్వాత బూత్‌ వెలుపల శేషగిరిరావుపై వైసీపీ మూకలు దాడిచేయడం.. తలపగిలి రక్తమోడుతున్నా ఆయన వారిని వెంబడించి దాడి చేసిన వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది.

జరిగిన ఘటనలను సమీపంలో ఉన్న ఒక యువతి తన సెల్‌ఫోన్‌లో బంధించారు. పిన్నెల్లి ప్రేరేపించడంతో శేషగిరిరావుపై వైసీపీ రౌడీ మూకలు బూత్‌ వెలుపల కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. కింద పడేసి కాళ్ల మీద, తల మీద తీవ్రంగా కొట్టారు. ఈలోపు గ్రామస్థులంతా అప్రమత్తమై రావడంతో రౌడీ మూకలు తమ కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించారు.

అప్పటికే తల పగిలి రక్తం కారుతున్నప్పటికీ శేషగిరిరావు ఓపిక తెచ్చుకుని వారిని వెంబడించారు. ఒకరిద్దరిపై దాడి కూడా చేశారు. అదే సమయంలో కారులో నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు దిగేందుకు ప్రయత్నించడంతో ఆయనపైకి కూడా వెళ్లబోయారు. ఈలోపు రౌడీ మూకలు తమ వాహనాల్లో వేగంగా వెళ్లిపోయారు.

Updated Date - May 24 , 2024 | 04:10 AM