Share News

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:02 PM

Union Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్‌2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..
Lok Sabha

Union Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్‌2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. దీంతో వారిని దగ్గరికి తీసుకుని అభినందించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ భుజం తట్టి అభినందించారు ప్రధాని మోదీ. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్‌సభలో మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


వారికి చెప్పండి ఈ విషయం..

ఈ సందర్భంగా ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం చేశామన్నారు. బయటకు వెళ్లి ప్రజలకు చెప్పండని ఎంపీలకు సూచించారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేస్తామని కూడా చెప్పండని అన్నారు ప్రధాని. దీంతో ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ప్రజలకు వివరిస్తామని.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు అవసరం అని ప్రధానిని కోరారు ఎంపీలు. దీనికి బదులిచ్చిన ప్రధాని తప్పకుండా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


టీడీపీ ఎంపీ భరత్ మాట్లాడుతూ..

లోక్‌సభ వెలుపల టీడీపీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి అనేక అంశాల్లో కేంద్ర బడ్జెట్‌లో సపోర్ట్ దొరికింది ఆనందంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అమరావతి, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఎప్పుడు కూడా గత వైసీపీ ఇన్ని నిధులు తెచ్చుకోలేదన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ నోబ్‌కు సపోర్ట్ చేస్తామని చెప్పారన్నారు. వైసీపీ గత ఐదేళ్లుగా అమరావతిని చంపాలని అనుకుందని.. చివరికి అది సాధ్యం కాలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామన్నారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని.. దానిని పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాన నరేంద్ర మోదీకి.. కేబినెట్‌కి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ భరత్.


ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ..

‘దేశ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ద్వారా నెరవేర్చే ప్రయత్నం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ దిగుబడి పెంచడంపై దృష్టి కేంద్రీకరించారు. సంక్షేమం కావాలి. తప్పదు. దాంతో పాటు ఉపాధి కల్పన కూడా కావాలి. ఉపాధి కల్పన కోసం బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా ఇది సాధ్యపడింది. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడం సాధ్యపడింది. పోలవరం ప్రాజెక్టు పెరిగిన అంచనా వ్యయం ఇవ్వమని అడుగుతున్నాం. ఏపీకి పరిశ్రమలు రావాలని చెప్పగా.. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ ఇచ్చారు. ఇది చాలా ఉపయోగకరం. పూర్వోదయ స్కీమ్ ద్వారా తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ భాగం. ఇందులో అన్ని రంగాల ప్రాజెక్టులు ఉంటాయి. బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం దొరికింది. ఏపీ ప్రజలు కోరుకుంటున్న దిశగా ఈ బడ్జెట్ ఒక మొదటి అడుగు. ఇందుకు ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. హైదరాబాద్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. అలాంటి నగరం ఏపీకి లేదు. అమరావతిని గత ప్రభుత్వం ఆపేసింది. అమరావతి వల్ల రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా లాభం అని సీఎం చెప్పారు. వెనుకబాటుతనం తక్కువగా ఉన్న రాష్ట్రాలు నరేగా నిధులు ఎక్కువ తీసుకెళ్లారు. ఏపీ గత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది.’ అని ఎంపీ అన్నారు.


Also Read:

బడ్జెట్‌ ప్రకటనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

మాకు బాధ లేదు... అసూయ లేదు..

కూటమి నేతలకు పవన్ హెచ్చరిక.. అలా చేస్తే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 23 , 2024 | 03:02 PM