RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..
ABN , Publish Date - Nov 19 , 2024 | 07:55 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ప్రకాశం జిల్లా: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Film director Ramgopal Varma) కేసు విచారణ (Case Investigation) మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ (Ongolu Rural Police Station)లో జరగనుంది. విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఇటీవల నోటీసులు (Notices) జారీ చేసారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు.
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం.. హైకోర్టు
కాగా సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాలలో వర్మ అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేశారు.
మద్దిపాడు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. రామ్‌గోపాల్ వర్మ తరఫున టి.రాజగోపాలన్ వాదనలు వినిపించారు. గత ఏడాది డిసెంబరులో పిటిషనర్ పోస్టు పెట్టారన్నారు. ఆ పోస్టుకు ఫిర్యాదుదారుడు బాధితుడు కాదన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. మంగళవారం సంబంధిత ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాల్సి ఉందని, హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు. పోలీసుల ముందు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలంటే సంబంధిత ఎస్‌హెచ్‌వోను అభ్యర్థించాలని సూచించారు. కాగా, రామ్‌గోపాల్‌వర్మ మంగళవారం ఒంగోలు రూరల్ సర్కిల్ స్టేషన్‌కు కేసు విచారణ నిమిత్తం హాజరుకానున్నారు. వర్మ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..
జగన్ దెబ్బ.. రాష్ట్రం అబ్బా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News