AP Politics: జగన్ బ్లాక్మెయిల్!
ABN , Publish Date - Mar 11 , 2024 | 08:32 AM
YS Jagan Siddham Sabha: ‘అన్నీ నేనే చేశా. నావల్లనే ప్రజలంతా బతుకుతున్నారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. మళ్లీ సీఎంగా నన్ను గెలిపించకపోతే పేదలకు అందే పథకాలన్నీ పోతాయి. పొత్తులతో వచ్చే వారిని కాదని పేదల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించండి’.. ఇలా ప్రజలను బ్లాక్మెయిల్ చేసేలా, అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తును విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు...
తన వల్లే ప్రజలు బతుకుతున్నారట
మళ్లీ సీఎంగా గెలిపించకపోతే..
పథకాలన్నీ పోతాయని అబద్ధాలు
బాబును గెలిపిస్తే అభివృద్ధి ఉండదట
వలంటీర్లు ఇంటింటికీ వెళ్లాలని వినతి
గిట్టని మీడియాపై అక్కసు
దక్షిణ కోస్తాంధ్ర ‘సిద్ధం’లో సీఎం అసత్యాలు
(బాపట్ల–ఆంధ్ర జ్యోతి):
‘అన్నీ నేనే చేశా. నావల్లనే ప్రజలంతా బతుకుతున్నారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. మళ్లీ సీఎంగా నన్ను గెలిపించకపోతే పేదలకు అందే పథకాలన్నీ పోతాయి. పొత్తులతో వచ్చే వారిని కాదని పేదల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించండి’.. ఇలా ప్రజలను బ్లాక్మెయిల్ చేసేలా, అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తును విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan) ప్రసంగించారు. పనిలో పనిగా గిట్టని మీడియాపైనా అక్కసు వెళ్లగక్కారు. ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో వైసీపీ నిర్వహించిన దక్షిణ కోస్తాంధ్ర ‘సిద్ధం’ సభలో జగన్ ప్రసంగం ఆద్యంతం అబద్ధాలు, అసత్యాలతో సాగింది. గత 58 నెలలుగా ఆయా వర్గాలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని, తనను మరోసారి సీఎంను చేయాలని అభ్యర్థించారు. అందుకోసం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించాలని వేడుకున్నారు.
రానున్నది ఎన్నికల మహా సంగ్రామమని, మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయని, అయితే వారు సైన్యం లేని సైన్యాధిపతులని ఎద్దేవా చేశారు. ఆ పార్టీల పరిస్థితి గత ఎన్నికల్లో చూస్తే ఒక పార్టీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తే, మరో పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. ప్రజలను వంచన చేసేందుకు ముగ్గురూ కలిసి వస్తున్నారని, వారికి ఎల్లో మీడియా అండగా ఉందని అక్కసు వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య సంగ్రామమని పదేపదే చెప్పిన జగన్.. అందులో పేదలు శ్రీకృష్ణుడిగా, తాను అర్జునుడిగా అభివర్ణించుకొని ముందుండి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. గడిచిన 58 నెలల్లో సంక్షేమ పథకాల కోసం డీబీటీ ద్వారా రూ.2.75 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లు పేదలకు అందించానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనను గెలిపించకపోతే అవన్నీ ఆగిపోతాయన్నారు.
రాజకీయ పొత్తులను కాకుండా ప్రజలను, దేవుడిని నమ్ముకొని ‘మీ బిడ్డ’ ఎన్నికల సంగ్రామంలో దిగుతుంటే, చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు, మరో జాతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మీడియా అండతో వస్తున్నాడన్నారు. చంద్రబాబును గెలిపిస్తే పథకాలు ఆగిపోతాయని, అభివృద్ధి ఉండదంటూ పదేపదే అబద్ధాలు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా తనలా పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన వారు లేరని, తన వల్లనే రాష్ట్రంలో ప్రజలు బతుకుతున్నారనే రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం సభలో తాను కాబట్టే పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నానని గొప్పలు చెప్తూ మరోవైపు మళ్లీ తనను గెలిపిస్తేనే అవి ప్రజలకు అందుతాయని బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రసంగించారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి