Tadepalligudem : ‘అల్ర్టాటెక్’ మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:58 AM
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీప బూదవాడ గ్రామంలోని అల్ర్టాటెక్ సిమెంట్ కర్మాగారంలో బ్రాయిలర్ పేలిన ఘటనలో మృతిచెందిన వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ చొరవతో రూ.50 లక్షల పరిహారం అందింది.
తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు
సీఎం కార్యాలయ చొరవతో మెరుగైన పరిహారం
మృతుడి కుటుంబానికి చెక్కు అందజేత
జగ్గయ్యపేట రూరల్, తాడేపల్లి టౌన్, జూలై 8: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీప బూదవాడ గ్రామంలోని అల్ర్టాటెక్ సిమెంట్ కర్మాగారంలో బ్రాయిలర్ పేలిన ఘటనలో మృతిచెందిన వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ చొరవతో రూ.50 లక్షల పరిహారం అందింది. ఈమేరకు కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సోమవారం చెక్కును భార్య త్రివేణి పేరిట కుటుంబ సభ్యులకు అందించారు. నష్టపరిహారం విషయంలో సీఎం కార్యాలయం జోక్యం చేసుకుని బాధితులకు మెరుగైన పరిహారం అందించేలా చూడాలని సూచించడంతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. కర్మాగారం యాజమాన్యంతో మాట్లాడి మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని, కంపెనీ యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, ఒకరికి ఉద్యోగం, పిల్లలకు 12వ తరగతి వరకు విద్య అందించేలా ఒప్పించామని తెలిపారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.25 లక్షలతో పాటు పూర్తిగా కోలుకునే వరకు ఉచిత వైద్యం, గాయపడిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు.
కలెక్టర్ సీరియస్
కర్మాగార సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదని, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 15 కుటుంబాల్లో విషాదం నెలకొందని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురావటంతో ఆమె తీవ్రంగా స్పందించారు. కంపెనీ అధికారులు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలు ఉంటే చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా సీఎ్‌సఆర్ నిధులతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలతో పాటు గ్రామస్థులందరి కోసం మంగళవారం నుంచి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్మిక మంత్రి పరామర్శ
మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలా్ట్రటెక్ బాధితులను రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొత్తం 16 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుడు ఆవుల వెంకటేష్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించినట్టు వెల్లడించారు. కార్మికులకు ఈఎ్‌సఐ, ఇన్సూరెన్స్ వంటి పథకాలను ఫ్యాక్టరీ వర్తింపజేస్తున్నదీ లేనిదీ విచారించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన వారిలో స్వామి, అర్జునరావు, గోపి నాయక్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. నష్టపరిహారంపై సీఎం చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. మంత్రివెంట రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిబాబు పాల్గొన్నారు.