Egg and Chicken prices: చికెన్, కోడి గుడ్డు రేట్లు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 02:00 PM
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, కోళ్ల ఆరోగ్య ప్రభావితం కావడం, కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం, న్యూయర్ వేడుకల సందర్భంగా కేకుల వినియోగం పెరగడం వంటి పలు కారణాలతో రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కోడి గుడ్డు రేట్లు కొండెక్కి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
హైదరాబాద్: చికెన్, కోడి గుడ్డు ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. చికెన్ రేట్లు దిగి రాగా, కోడి గుడ్డు ధర మాత్రం కొండెక్కింది. హైదరాబాద్, విజయవాడ బహిరంగ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.620కు చేరింది. అంటే డజన్ రూ.84లు ఉండగా, ఒక్కో గుడ్డు ధర రూ.7లకు చేరింది. కానీ, హోల్ సేల్ మార్కెట్లో మాత్రం రూ.6.30 పలుకుతోంది. నూతన సంవత్సరం, కిస్మస్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధర పెరిగినట్లు తెలుస్తోంది.
చలికాలం ప్రభావంతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేజీ చికెన్ ధర రూ.180లు పలుకుతోంది. కార్తికమాసానికి ముందు కిలో చికెన్ ధర రూ.230పైగా ఉంది. కార్తికమాస నేపథ్యంలో ప్రజలు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కోడిగుడ్డుకు మాత్రం డిమాండ్ పెరిగింది.
ఈ ఏడాది రేట్లు ఇవే..
రానున్న రోజుల్లో కోడి గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, నూతన సంవత్సవం వేళ కేకుల తయారీకి గుడ్లను పెద్దఎత్తున వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు మరింత పెరిగి అవకాశం ఉంది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.7లు పలికింది. ఏప్రిల్ నెల వచ్చే సరికి ఏకంగా గుడ్డుకు రూ.2.5 నుంచి రూ.3 వరకూ తగ్గి రూ.4 నుంచి రూ.4.50 వరకూ ధర పలకింది. మే నెలలో రూ.5 నుంచి రూ.5.50కు గుడ్డు ధర చేరింది. అలాగే జూన్, జులై మాసాల్లో పెరుగుతూ ఆగస్టు నెల వచ్చే సరికి రూ.6 నుంచి రూ.6.50కు చేరుకుంది. తాజాగా మళ్లీ రూ.7లకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం డజన్ కోడిగుడ్లు రూ.84లు పలుకుతున్నాయి.