Share News

Retired SP Vijaypal : టార్చరా.. అదేం లేదే!

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:20 AM

మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో విశ్రాంత సీఐడీ అదనపు ఎస్పీ, ఆ కేసులో విచారణ అధికారి విజయ్‌పాల్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన గుంటూరులోని వెస్ట్‌ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

Retired SP Vijaypal : టార్చరా.. అదేం లేదే!

  • రఘురామ కేసులో విజయ్‌పాల్‌ వింత జవాబు

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణకు..

  • కానీ, విచారణకు సహకరించని విశ్రాంత సీఐడీ ఏఎస్పీ

  • పలు ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదంటూ దాటవేత

  • టార్చర్‌పై నాటి స్టేట్‌మెంట్స్‌ను చూపినా అదే ధోరణి

  • అవి మీరే రాసుకొని ఉంటారంటూ సమాధానం

  • ఇంతకాలం ఎక్కడున్నారంటేటూర్‌కు వెళ్లానని బదులు

  • రఘురామ కేసులో విజయ్‌పాల్‌ వింత జవాబు

  • మూడు గంటలకుపైగా విచారించిన పోలీసులు

  • రెండు రోజుల్లో మళ్లీ రావాలంటూ ఆదేశాలు

గుంటూరు, అక్టోబరు 11: మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో విశ్రాంత సీఐడీ అదనపు ఎస్పీ, ఆ కేసులో విచారణ అధికారి విజయ్‌పాల్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన గుంటూరులోని వెస్ట్‌ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. గుంటూరు జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీ జయరామ్‌ ప్రసాద్‌ తదితరులు రాత్రి 7.15 వరకు, అంటే మూడుగంటల పాటు విచారించారు. పోలీసు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా, దాటవేేస ధోరణి అవలంభించారు.

మరికొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా స్పందించినట్టు తెలిసింది. రఘురామరాజును అరెస్ట్‌ చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించిన రోజు అక్కడకు అధికారులు ఎవరెవరు వచ్చారు.. రఘురామను కొట్టిన వారెవరు? విచారణ అధికారిగా ఉన్న మీరు మధ్యలో వేరే వారికి అప్పగించి బయటకు ఎందుకు వెళ్లారు.. ఎక్కడికి వెళ్లారు? ఎవరెవరితో మాట్లాడారు? అసలు ఆ రోజు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు విజయ్‌పాల్‌ సమాధానం చెప్పలేదని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదు. అసలు రఘురామరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ జరగలేదని చెప్పారు.


టార్చర్‌ జరిగినట్టు అంగీకరిస్తూ ఆరోజు విధుల్లో ఉన్న సీఐడీ అధికారులు, సిబ్బంది ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను చూపగా, అవి మీరే రాసుకొని ఉంటారని విజయ్‌పాల్‌ బదులిచ్చారు. ఆ రోజు సీఐడీ కార్యాలయానికి బయట వ్యక్తులు ఎవరు రాలేదని కూడా చెప్పారు. ఆ రోజు అక్కడ సీఐడీ అధికారులు ఎవరెవరు ఉన్నారో తనకు గుర్తు లేదన్నారు. ఇంతకాలం మీరు ఎక్కడున్నారని అడుగగా.. టూర్‌లో ఉన్నట్లు చెప్పారు. మరికొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని సమాధానం ఇచ్చారు. కాగా, రఘురామ కేసులో నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ ఏ1 కాగా, ఆనాటి నిఘా డీజీ సీతారామాంజనేయులును ఏ2గా, నాటి సీఎం జగన్మోహన్‌ రెడ్డిని ఏ3 నిందితుడిగా చేర్చారు.

ఏ4 గా విజయ్‌పాల్‌ను, ఏ5గా నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిని చేర్చి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విజయ్‌పాల్‌ అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం గుంటూరు జిల్లా కోర్టును, హైకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరించే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీస్‌ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈలోగా పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా విజయ్‌పాల్‌ను ఆదేశించింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన విచారణకు హాజరయ్యారు.

  • పిలిచినప్పుడు మళ్లీ విచారణకు రావాలి

మరో 2 రోజుల్లో తాము పిలిచినప్పుడు విచారణకు రావాలని విజయ్‌పాల్‌కు అదనపు ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏ రోజున విచారణకు రావాలో నోటీసు జారీ చేస్తామని తెలిపారు. వచ్చే సోమ,మంగళవారాల్లో విజయఫాల్‌ను మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 12 , 2024 | 03:20 AM