Share News

సదరం.. సమస్యలు అనేకం

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:01 AM

సదరం సర్టిఫికెట్ల మంజూరుపై అవగాహన లేకపోవడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సదరం.. సమస్యలు అనేకం
Sadaram Problems

  • అవగాహన లేకపోవడంతో ఇబ్బందిపడుతున్న దివ్యాంగులు

  • స్లాట్‌ బుక్‌ చేసుకోకుండానే నేరుగా ఆస్పత్రులకు వస్తున్న విభిన్న ప్రతిభావంతులు

  • ఉత్తరాంధ్రతోపాటు పక్కనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రాక

  • స్లాట్‌ కేటాయించకుండా పరీక్షలు నిర్వహించలేమంటున్న వైద్యులు


విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి:సదరం సర్టిఫికెట్ల మంజూరుపై అవగాహన లేకపోవడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్టిఫికెట్ల కోసం ఇటు శ్రీకాకుళం నుంచి అటు పశ్చిమ గోదావరి జిల్లా వరకూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో నగరంలోని కేజీహెచ్‌, మానసిక వైద్యశాల, ఈఎన్‌టీ, కంటి ఆస్పత్రులకు వస్తున్నారు. అయితే, వైకల్యాన్ని నిర్ధారించే పరీక్షలు వైద్యులు నిర్వహించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సదరం వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆ సమయంలో మాత్రమే సంబంధిత ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించుకోవాలి. వైద్యుల తనిఖీ అనంతరం ప్రభుత్వం వారి వైకల్యాన్ని నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్‌తో ప్రభుత్వం అందించే పెన్షన్‌తోపాటు ఇతర సంక్షేమ పథకాలు పొందవచ్చు. కానీ, ఈ విధానంపై అవగాహన లేక ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి నేరుగా ఆస్పత్రులకు వస్తున్నారు. తీరా ఇక్కడి వైద్యులు స్లాట్‌ బుక్‌ చేసుకోకుండా సదరం సర్టిఫికెట్‌ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేస్తుండడంతో వారంతా వెనుతిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.


లేని అవగాహన..

సదరం సర్టిఫికెట్‌ మంజూరుపై దివ్యాంగులకు అవగాహన లేక ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది. అదేవిధంగా స్థానికంగా ఉండే నాయకులు...తమను పెన్షన్‌ గురించి ఎవరైనా అడిగితే వైజాగ్‌లో ఫలానా ఆస్పత్రికి వెళ్లి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే వెంటనే ఇప్పించేస్తా అని చెబుతుండడం మరో కారణంగా తెలుస్తోంది. ఆస్పత్రుల్లో వైద్యులు సదరు దివ్యాంగులతో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో వైద్యులు, అక్కడున్న సిబ్బంది సదరం సర్టిఫికెట్లు అందించే ప్రక్రియను, స్లాట్‌ బుక్‌ చేసే విధానాన్ని తెలియజేసి వారిని వెనక్కి పంపిస్తున్నారు.


దళారుల దందా

అనేక ప్రాంతాల్లో దళారులు దివ్యాంగుల అమాయకత్వాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. పెన్షన్‌ వచ్చేందుకు అవసరమైన సర్టిఫికెట్‌ మంజూరు చేయిస్తామని చెప్పి రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెలలు, రోజులు తరబడి తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నార తప్ప పని చేయడం లేదు. ఇటువంటి దళారుల బాధితులు ఎంతోమంది వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.


స్లాట్‌ డేట్‌ మర్చిపోయి..

ఆన్‌లైన్‌లో ఖాళీ బట్టి నెల నుంచి రెండు నెలలు వ్యవధిలో స్లాట్‌ దొరుకుతుంది. అయితే, ఎంతోమంది తమకు ఆన్‌లైన్‌లో ఇచ్చిన స్లాట్‌ తేదీలను మర్చిపోతున్నారు. ఆ తేదీలు ముగిసిన తరువాత ఆస్పత్రులకు వస్తున్నారు. స్లాట్‌ కేటాయించినప్పుడు రాకపోతే తాము చేసేదేమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైద్యులతో కొందరు వాదనకు దిగుతుంటారు.

పెన్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారంటే వచ్చేశాం

- రాయి సత్తిబాబు, మండపేట

షుగర్‌ వల్ల కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. కరోనా సమయంలో కాళ్లు తీసేయాల్సి వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్లు కేజీహెచ్‌కు వెళ్లి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే పెన్షన్‌కు పెడతామని చెప్పారు. దీంతో ఆదివారం బయలుదేరి వచ్చాం. రాత్రి ఒంటి గంట అయింది. రైల్వే స్టేషన్‌లో పడుకుని ఉదయాన్నే కేజీహెచ్‌కు వచ్చాం. ఓపీ తీసుకుని డాక్టర్‌ దగ్గరకు వెళ్లేసరికి 11 గంటలు అయింది. తీరా డాక్టర్‌ను సర్టిఫికెట్‌ ఇవ్వమంటే కుదరదన్నారు. ఆన్‌లైన్‌లో సదరం స్లాట్‌ బుక్‌ చేసుకుని రావాలని చెప్పారు. ఊళ్లో ఎవరూ ఈ విషయాన్ని చెప్పలేదు. అనేక ఇబ్బందులు పడి ఇక్కడకు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఆస్పత్రి అంతా ఇలా చిన్నపాటి బల్లల సాయంతో తిరిగాను. వీల్‌ చైర్‌ అడిగితే డబ్బులు అడిగారు. డబ్బులు ఇచ్చే స్థోమత లేకపోవడంతో వీటి సాయంతోనే ఆస్పత్రి అంతా తిరిగాను.



మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 20 , 2024 | 01:33 PM