Budget 2024: దేశ ముఖచిత్రాన్ని మార్చిన బడ్జెట్‌లివే..
ABN , Publish Date - Jul 11 , 2024 | 02:58 PM
బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ఏడో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన కీలక బడ్జెట్ల గురించి తెలుసుకుందాం.
ఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో 7వ సారి పద్దుని ఆమె పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ల ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం..
మొదటి బడ్జెట్ (1947)
నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆగస్టు 15, 1947 నుంచి మార్చి 31, 1948 మధ్య ఏడున్నర నెలల తాత్కాలిక బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. 1948 సెప్టెంబర్ వరకు భారత్, పాకిస్థాన్ రెండింటి మధ్య ఒకే కరెన్సీ ఉండాలనే విషయాన్ని నొక్కిచెబుతూ ప్రవేశపెట్టిన మొదటి కేంద్ర బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్ దేశ విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించింది.
బ్లాక్ బడ్జెట్(1973)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రి యశ్వంతరావు బి. చవాన్1973-74 బడ్జెట్‌ను సమర్పించారు. అధిక ఆర్థిక లోటు కారణంగా ఈ పద్దుని 'బ్లాక్ బడ్జెట్'గా పిలుస్తారు. కేవలం రూ.550 కోట్లతో దీన్ని ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం పరిస్థితుల మధ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
క్యారెట్, స్టిక్ బడ్జెట్ (1986)
దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, పన్ను ఎగవేతలు, నలధనాన్ని అరికట్టడానికి కఠినమైన చర్యలతో 1986లో అప్పటి ఆర్థిక మంత్రి వీపి సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్' అని పిలుస్తారు. దేశంలో అప్పటికే పాతుకుపోయి ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థకు ఈ బడ్జెట్‌తో ఫుల్స్టాప్ పెట్టారు. పన్నుల క్యాస్కేడింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి, తయారీదారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి విలువ ఆధారిత పన్ను (MODVAT)ను పరిచయం చేశారు. పన్ను ఎగవేతదారులు, స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటర్లపై కూడా ఈ బడ్జెట్ ప్రభావం చూపింది.
ఎపోచల్ బడ్జెట్ (1991)
దేశంలో ఆర్థిక సరళీకరణకు నాంది పలికినందుకు1991లో మాజీ ప్రధాని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ సమర్పించిన బడ్జెట్‌ను 'యుగ బడ్జెట్'(Epochal Budget) అని పిలుస్తారు. దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన బడ్జెట్లలో ఇది ఒకటి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఆర్థిక సంస్కరణలను ఈ బడ్జెట్ ద్వారా తీసుకొచ్చారు. స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ జీవం పోసింది. భారత ఆర్థిక వ్యవస్థ బహిరంగ మార్కెట్‌కి అవకాశం ఇవ్వడంలో ఈ బడ్జెట్ ఉపయోగపడింది. ఎగుమతుల పెంపునకు, దిగుమతి సుంకాల తగ్గింపు, పరిశ్రమలపై నియంత్రణ సడలింపు, భారత రూపాయి విలువ తగ్గింపు వంటి ప్రధాన సంస్కరణలు ఈ బడ్జెట్లో మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టారు. ఇది కస్టమ్స్ సుంకాన్ని 220 శాతం నుండి 150 శాతానికి తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించింది.
డ్రీమ్ బడ్జెట్ (1997)
1997-98లో పీ.చిదంబరం సమర్పించిన బడ్జెట్‌కు 'డ్రీమ్ బడ్జెట్' అని పేరు పెట్టారు. ఇది ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం, కార్పొరేట్ పన్ను సర్‌ఛార్జ్‌లను తొలగించడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వంటి అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయ వెల్లడి పథకాన్ని (వీడీఐఎస్) కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి తగ్గించి, ఎక్సైజ్ సుంకాన్ని సరళీకృతం చేసింది.
మిలీనియం బడ్జెట్ (2000)
2000లో యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్.. సమాచార సాంకేతికత పరిశ్రమపై దృష్టి సారించింది. బడ్జెట్లో IT, టెలికమ్యూనికేషన్లను ప్రోత్సహించడానికి అప్పటి సర్కార్ చర్యలు తీసుకుంది. దేశాన్ని IT పవర్‌హౌస్‌గా కేరాఫ్‌గా మార్చడంలో ఈ బడ్జెట్ ఉపయోగపడింది. ఇది ఐటీ పరిశ్రమ వృద్ధికి రోడ్ మ్యాప్‌గా మారింది. సాఫ్ట్వేర్ ఎగుమతిదారులపై ప్రోత్సాహకాలను తగ్గించింది. కంప్యూటర్లు, కంప్యూటర్ ఉపకరణాలు వంటి 21 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.
రోల్‌బ్యాక్ బడ్జెట్ (2002)
2002-03లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్‌ను 'రోల్‌బ్యాక్ బడ్జెట్' అని పిలుస్తారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు, విధానాలను ఉపసంహరించుకోవడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
రైల్వే విలీనం (2017)
మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017లో కేంద్ర బడ్జెట్‌ని సమర్పించారు. అనేక కీలక సంస్కరణలు ఈ బడ్జెట్లో తీసుకువచ్చారు. సాధారణంగా మార్చి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను తొలిసారిగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అప్పటి వరకు రైల్వే బడ్జెట్‌ని విడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి చెప్పి.. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో విలీనం చేశారు. దీంతోపాటు నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టడానికి ఉద్దేశించిన నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇదే కావడం విశేషం. 2017 యూనియన్ బడ్జెట్ ఆర్థిక వృద్ధిని, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి ఉపయోగపడింది.
వన్స్ ఇన్ ఎ సెంచరీ బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను 'శతాబ్దానికి ఒకసారి వచ్చే బడ్జెట్' అని పిలుస్తారు. ప్రైవేటీకరణలో దూకుడు పెంచడం, పన్ను సంస్కరణలతో పాటు మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులను పెంచడం ద్వారా ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ని నిలపాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు.
For Latest News and National News click here