Zomato: జొమాటో నుంచి కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్య తీరినట్టే
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:06 PM
మార్కెట్లో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలదే రాజ్యం. ఈ మధ్య కాలంలో అత్యధిక లాభాలు సాధిస్తున్న జొమాటో(Zomato) యాప్‌లోనూ వినూత్న ఫీచర్లు తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆకలేస్తే వండుకోనవసరం లేకుండా చిటికెలో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల వచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలదే రాజ్యం. ఈ మధ్య కాలంలో అత్యధిక లాభాలు సాధిస్తున్న జొమాటో(Zomato) యాప్‌లోనూ వినూత్న ఫీచర్లు తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే.. యాప్‌తోనే యూపీఐ చెల్లింపులు జరిపే ఫీచర్ తీసుకొచ్చి చిల్లర బాధలు లేకుండా చేసింది.
తాజాగా మరో ఫీచర్‌తో ముందుకువచ్చింది. స్నేహితులంతా ఓ చోట చేరితే వారికి ఇష్టాఇష్టాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. వారికి ఇష్టమైన ఫుడ్ ఏంటో కనుక్కొని ఆర్డర్ పెడుతుంటారు. అయితే ప్రతీ సారి ఇలా అందరినీ కనుక్కొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికే జొమాటో గ్రూప్ ఆర్డరింగ్ పేరుతో ఓ నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలు కల్పించేలా ఈ ఫీచర్ ఉంది.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఫీచర్ విశేషాలను ఎక్స్‌లో తెలిపారు. గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్ సహాయంతో.. ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో కార్ట్‌లో మీ స్నేహితులందరినీ భాగస్వామ్యం చేయొచ్చు. దీని కోసం గ్రూప్ ఆర్డర్‌లో ఉండే లింక్‌ను వారికి పంపాలి. దానితో ప్రతి ఒక్కరూ నచ్చిన ఫుడ్‌ను కార్ట్‌లో యాడ్ చేస్తారు. దీంతో ఎవరికి నచ్చిన ఫుడ్‌ను వారే స్వయంగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికైతే ఈ ఫీచర్ కొందరికే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని దీపిందర్ పేర్కొన్నారు.
నెటిజన్ల మరో రిక్వస్ట్..
గ్రూప్ ఆర్డర్‌లానే చెల్లింపులను కూడా షేర్ చేసుకునే మరో ఫీచర్‌ను తీసుకురావాలని కొందరు యూజర్లు దీపిందర్‌ని అడిగారు. అయితే త్వరలోనే ఈ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు గోయల్ చెప్పారు. ఇవన్నీ ఫీచర్లు వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సాయపడతాయన్నారు.
For Latest News and National News click here